Modi: భారత్‌ లేకపోతే.. భద్రతా మండలి పరిపూర్ణం కాదు: మోదీ

Modi: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పేద దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి దేశాల ఎదుగుదలకు భారత్‌ వేదికగా మారుతోందని వ్యాఖ్యానించారు.

Updated : 13 Jul 2023 15:59 IST

దిల్లీ: పేద దేశాల ఎదుగుదలకు భారత్‌ వేదిక లాంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌ లేకుండా.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) పరిపూర్ణం కాదని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌ (France) పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ.. అంతకుముందు ప్రముఖ ఫ్రెంచ్‌ డెయిలీ లెస్‌ ఎకోస్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై భారత్‌ పోషిస్తున్న కీలక పాత్రను మరోసారి వివరించారు.

‘‘అత్యధిక జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్‌.. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం కానప్పుడు ఆ మండలి ప్రపంచం కోసం ఎలా మాట్లాడగలదు?’’ అని మోదీ (PM Modi) ప్రశ్నించారు. ఐరాస భద్రతా మండలి (UNSC)లో ఎలాంటి మార్పులు జరగాలి?ఇందుకోసం తాము ఎలాంటి పాత్ర పోషించాలి అన్నదానిపై భారత్‌తో సహా చాలా దేశాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.

యుద్ధం కాదు.. ఆయుర్వేదానికే..

‘‘యోగా అనేది ఇప్పుడు మన నిత్య జీవితంలో భాగమైంది. మా సంప్రదాయ ఔషధమైన ఆయుర్వేదాన్ని ప్రపంచమంతా ఆమోదిస్తోంది. మా నిపుణులు ఎన్నడూ యుద్ధం, అణచివేత వంటి వాటికి పాల్పడలేదు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, శాస్త్రం, గణితం వంటి ప్రజా ఉపయోగకర అంశాలపైనే దృష్టి సారించారు’’ అని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.

ఇక రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine conflict)పై స్పందిస్తూ.. ‘‘ఈ ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలకు మద్దతిచ్చేందుకు భారత్‌ సుముఖంగా ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఇరు దేశాధినేతలు పుతిన్‌, జెలెన్‌స్కీకి చాలా సార్లు చెప్పా. ఇది యుద్ధాల యుగం కాదని పునరుద్ఘాటిస్తున్నా. దౌత్యపరమైన చర్యలతో సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆరు దేశాలను కోరుతున్నాం’’ అని మోదీ (Modi) మరోసారి స్పష్టం చేశారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు.. ముఖ్యంగా పేద దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని అన్నారు. ఇప్పటికే కొవిడ్‌ మహమ్మారితో కుదేలైన దేశాలు.. ఇప్పుడు ఆహారం, విద్యుత్తు కొరత, ఆహార సంక్షోభం, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. అందుకే ఈ యుద్ధాన్ని ముగించాలని పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ గురువారం ఫ్రాన్స్‌ పర్యటనకు బయల్దేరారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఆహ్వానం మేరకు ఆయన.. ఆ దేశ నేషనల్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పారిస్‌లో శుక్రవారం జరిగే నేషనల్‌ డే పరేడ్‌లో మోదీ పాల్గొంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని