Heavy Rains: భారీ వర్షాలు.. పేకమేడలా కూలిన డిఫెన్స్‌ కాలేజీ

Dehradun Defence College: భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లో ఓ డిఫెన్స్‌ కాలేజీ పేకమేడలా కూలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

Updated : 14 Aug 2023 10:48 IST

దేహ్రాదూన్‌: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు (Heavy Rains) మరోసారి ముంచేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు హిమాచల్‌ ప్రదేశ్‌లో బియాస్‌ నది మళ్లీ ఉప్పొంగగా.. ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ డిఫెన్స్‌ కాలేజీ (Dehradun Defence College) భవనం పేకమేడలా కూలిపోయింది. మాల్‌దేవతా జిల్లాలో గల గఢ్వాల్ హిమాలయాల సమీపంలో నది ఒడ్డున ఈ కాలేజీ ఉంది.  వర్షాల కారణంగా నది ఉద్ధృతంగా ప్రవహించడంతో సోమవారం ఉదయం ఈ భవనం ఒక్కసారిగా కూలి నదిలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video) అవుతున్నాయి.

హిమాచల్‌లో కుంభవృష్టి.. ఏడుగురి మృతి

అయితే, ప్రమాద సమయంలో ఈ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను విషాదం తప్పింది. ఈ కాలేజీ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఐఐటీ, టెక్నికల్‌ కోర్సులతో  పాటు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఇక్కడ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. అయితే, భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో ఈ కాలేజీలో ప్రస్తుతం విద్యార్థులెవరూ లేరు. 

ఉత్తరాఖండ్‌లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లోనూ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు