Cloudburst: హిమాచల్‌లో కుంభవృష్టి.. ఏడుగురి మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో నిన్న రాత్రి కుంభవృష్టి కురిసింది. ఈ ఘటనలో ఏడుగురు  చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

Updated : 14 Aug 2023 10:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని సోలన్‌ జిల్లాలో ఆదివారం జలప్రళయం కళ్లముందు కనిపించింది. ఇక్కడ ఉన్న జాదోన్‌ గ్రామంలో నిన్న రాత్రి కురిసిన కుంభవృష్టి (Cloudburst)తో ఏడుగురు చనిపోయినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యలయం ట్విటర్‌లో పేర్కొంది. మృతులకు సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు సంతాపం తెలిపారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు వివిధ శాఖల అధికారులను పంపిస్తున్నట్లు వెల్లడించారు. 

 నేడు రాష్ట్రంలోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మండి, సిమ్లా, బిలాస్‌పూర్‌ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేసింది. ఈ విషయాన్ని స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ పేర్కొంది. సిమ్లా-కాల్కా జాతీయ రహదారి కూడా వర్షాల దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైంది. ఈ మార్గం సిమ్లాను చండీగడ్‌తో కలుపుతుంది. దీనిపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గత 48 గంటల్లో కురిసిన వర్షాల దెబ్బకు బియాస్‌, దాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. మాన్‌, కునా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హమీర్‌పుర్‌లో భవనాలు దెబ్బతిన్నాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ సీజన్‌లో వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రూ.7,020.28 కోట్ల నష్టం జరిగింది. జూన్‌ 24 నుంచి కురుస్తున్న వర్షాల్లో 257 మంది  ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది ఆచూకీ గల్లంతుకాగా.. 290 మంది గాయపడ్డారు. 

ఉత్తరాఖండ్‌లో..

మరోవైపు ఉత్తరాఖండ్‌లో వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. చాలా రోడ్లపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రిషికేశ్‌-ఛంబా నేషనల్‌ హైవేను మూసివేశారు. హరిద్వార్‌లో గంగానది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఆదివారం సాయంత్రం చమోలీ జిల్లాలోని త్రాలి, నందానగర్‌ ఘాట్‌ ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా ప్రభావితం అయ్యాయి. పిండర్‌, నందాకిని నదుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇక్కడ ఓ మోటార్‌బ్రిడ్జ్‌, సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు.

పంద్రాగస్టు వేడుకలకు సామాన్యులే అతిథులు

ఈ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. వీటిల్లో దేహ్రాదూన్‌, నైనిటాల్‌ కూడా ఉన్నాయి. కోట్‌ద్వార్‌లో భారీ వర్షాల కారణంగా మాలన్‌ సుక్రు నది పొంగి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు