Delhi Airport: ‘సరదా’ కోసం విమానానికి బాంబు బెదిరింపు.. 13 ఏళ్ల బాలుడు అదుపులోకి

దిల్లీ నుంచి టొరంటో వెళ్లే ‘ఎయిర్‌ కెనడా’ విమానానికి బాంబు బెదిరింపు కేసులో ఓ 13 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 11 Jun 2024 17:20 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నుంచి టొరంటో వెళ్లే ‘ఎయిర్‌ కెనడా’ విమానానికి ఇటీవల బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఓ 13 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని విచారించగా.. పలు ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. తనను పట్టుకుంటారా? లేదా? అని చెక్‌ చేసేందుకు సరదా కోసమే దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ (Delhi Airport)కు ఆ తప్పుడు ఈమెయిల్‌ పంపినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు.

‘‘గతంలో ముంబయి విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఇలాంటి ఘటన గురించి బాలుడు తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే తప్పుడు బాంబు బెదిరింపు ఈమెయిల్‌ పంపాలనే ఆలోచన వచ్చింది. ఇలా చేస్తే.. పోలీసులు తనను పట్టుకుంటారో? లేదో? చూడాలనుకున్నాడు. బెదిరింపునకు కొన్ని గంటల ముందే తన ఫోన్‌లో ఈమెయిల్‌ ఐడీ సృష్టించాడు. తన తల్లి ఫోన్‌ వైఫై ఉపయోగించి మెయిల్‌ పంపాడు. అనంతరం ఆ ఐడీని డిలీట్‌ చేశాడు’’ అని పోలీసులు వెల్లడించారు. భయంతో తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదని, మరుసటి రోజు బాంబు బెదిరింపు వార్తలు చూసి ఉత్సాహపడ్డానని అతడు చెప్పినట్లు తెలిపారు.

అలా చేస్తే మా కంపెనీలో యాపిల్‌ పరికరాలు బంద్‌: ఎలాన్ మస్క్

విమానంలో బాంబు ఉందంటూ దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు జూన్‌ 4న రాత్రి ఓ ఈమెయిల్‌ వచ్చింది. దీంతో విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఫ్లైట్‌లో తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. ‘ఎయిర్‌ కెనడా’ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో బాలుడిని పట్టుకున్నారు. అతడిని జువనైల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట ప్రవేశపెట్టామని తెలిపారు. రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని