Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ రెండో ఆదేశాలు..

Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచి దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రి వెల్లడించారు. మరోవైపు ఆయన అరెస్టును నిరసిస్తూ ఆప్‌ నేతలు నేడు ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు.

Updated : 26 Mar 2024 10:28 IST

దిల్లీ: మద్యం విధానానికి (Excise Policy Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) కస్టడీలో ఉన్నారు. అయితే, అక్కడి నుంచే ఆయన పాలన సాగిస్తుండటం చర్చనీయాంశమైంది. కస్టడీ నుంచి ఆయన ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేపట్టగా.. ఇదే సమయంలో తాజాగా సీఎం మరోసారి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

మంగళవారం ఉదయం లాకప్‌ నుంచి కేజ్రీవాల్‌ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్‌ నేత, దిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ‘‘కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. 

ఇటీవల ఆయన నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిశీకి నోట్‌ ద్వారా ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్‌ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఆతిశీని ప్రశ్నించే అవకాశముంది.

ఖలిస్థానీ గ్రూపుల నుంచి ఆమ్‌ఆద్మీకి రూ.133 కోట్లు: పన్నూ

మోదీ నివాసం ముట్టడికి పిలుపు..

ఇదిలా ఉండగా కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆందోళనలను తీవ్రం చేసింది. మంగళవారం ప్రధాని మోదీ నివాసం ముట్టడికి పిలుపునిచ్చింది. దీనికి అనుమతి ఇవ్వని పోలీసులు దిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ సమీపంలోని పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. పీఎం నివాసానికి వెళ్లే రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. 

మద్యం విధానానికి సంబంధించిన కేసులో మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ గురువారం (మార్చి 28) వరకు కోర్టు ఆయనకు కస్టడీ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని