Kejriwal: ఇలాగైతే భారత్‌ ఎలా పురోగమిస్తుంది?: గుజరాత్‌లో స్కూళ్లపై కేజ్రీవాల్‌ ట్వీట్‌

గుజరాత్‌లో 341 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒకే తరగతి గదితో నడుస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించడంపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు.

Published : 22 Feb 2024 16:07 IST

దిల్లీ: గుజరాత్‌లో 341 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒకే తరగతి గదితో నడుస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేబుర్‌ దిండోర్‌ అసెంబ్లీలో మంగళవారం ఇచ్చిన సమాచారం చర్చనీయాంశంగా మారింది. దీంతో అక్కడి పాఠశాలల పరిస్థితిపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) స్పందించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్నా ఇంకా ఒక్కో గదిలోనే 341 స్కూళ్లు నడుస్తున్నాయంటే గుజరాత్‌ ప్రభుత్వానికి ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదన్నారు. ఇలాగైతే భారతదేశం ఎలా పురోగమిస్తుందని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు.

గుజరాత్‌లో 341 ప్రాథమిక పాఠశాలల్లో ఒకే తరగతి గది

దిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్‌లో 25శాతం నిధుల్ని విద్యపైనే ఖర్చు చేస్తోందని.. తమ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు నీట్‌, జేఈఈ, ఎన్‌డీఏ వంటి పరీక్షల్లో విజయం సాధిస్తున్నారని కేజ్రీవాల్‌ తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తేనే పిల్లలు చదువుకుని, అభివృద్ధి చెంది దేశాన్ని ముందుకుతీసుకెళ్తారని పేర్కొన్నారు. ఈ పనిని తాము దిల్లీలో చేస్తున్నామని.. పంజాబ్‌లో కూడా ప్రారంభించామన్నారు. దేశంలో తమకు ఎక్కడ అవకాశం వచ్చినా ఇలాగే చేస్తామని.. దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.

గుజరాత్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కిరీట్‌ పటేల్‌ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి కుబేర్‌ దిండోర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో 2023 డిసెంబర్‌ నాటికి 341 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒకే తరగతి గదితో నడుస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, విద్యా విభాగంలో 1,400 ఉన్నతస్థాయి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను కూల్చివేయడం, విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడం, కొత్త తరగతి గదులు నిర్మించేందుకు స్థలం లేకపోవడం వంటి కారణాలతో కొన్ని పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొందని కుబేర్ దిండోర్‌ వివరించారు. ఆయా స్కూళ్లలో కొత్త తరగతి గదులను వీలైనంత వేగంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని