Gujarat: గుజరాత్‌లో 341 ప్రాథమిక పాఠశాలల్లో ఒకే తరగతి గది

Gujarat: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కిరీట్‌ పటేల్‌ విద్యాశాఖపై అసెంబ్లీలో అడిగిన ఓ ప్రశ్నకు గుజరాత్‌ విద్యాశాఖ మంత్రి కుబేర్‌ దిండోర్‌ మంగళవారం ఇచ్చిన సమాధానంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Published : 21 Feb 2024 09:48 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో 2023 డిసెంబర్‌ నాటికి 341 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒకే తరగతి గదితో నడుస్తున్నాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కుబేర్‌ దిండోర్‌ వెల్లడించారు. మరోవైపు విద్యా విభాగంలో 1,400 ఉన్నతస్థాయి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కిరీట్‌ పటేల్‌ అసెంబ్లీలో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ మంగళవారం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఇటీవలి కాలంలో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను కూల్చివేయడం, విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడం, కొత్త తరగతి గదులు నిర్మించేందుకు స్థలం లేకపోవడం వంటి కారణాలతో కొన్ని పాఠశాల్లో ఈ పరిస్థితి నెలకొందని కుబేర్ దిండోర్‌ వివరించారు. ఆయా స్కూళ్లలో కొత్త తరగతి గదులను వీలైనంత వేగంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్ ఎడ్యుకేషన్ సర్వీస్ కేడర్‌లోని క్లాస్-1, క్లాస్-2 అధికారుల ఖాళీల గురించి ఎమ్మెల్యే పటేల్ లేవనెత్తిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2023 డిసెంబర్ 31 నాటికి 1,459 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 781 భర్తీ చేశామని చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టును పదోన్నతులు, ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు.

భాజపా హయాంలో గుజరాత్‌లో విద్యా నాణ్యత వేగంగా దిగజారిపోతోందని, ఇతర రాష్ట్రాలతో పోల్చలేని పరిస్థితి నెలకొందని పటేల్ ఆరోపించారు. ‘‘గుజరాత్‌ను ఆదర్శ రాష్ట్రంగా ప్రచారం చేయడంలోనే భాజపా నిమగ్నమైంది. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. 2023 గ్రేడింగ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం గుజరాత్‌లోని ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 25 శాతం మంది పిల్లలు కనీసం గుజరాతీ కూడా చదవలేకపోతున్నారు. 47.20 శాతం మందికి ఇంగ్లిష్‌ చదవడం రావట్లేదు. విద్యారంగంలో మంచి పనితీరు కనబరిచిన మొదటి ఐదు రాష్ట్రాల్లో గుజరాత్ లేదు’’ అని పటేల్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 65 వేలకు పైగా స్మార్ట్ తరగతి గదులను నిర్మించిందని.. మరో 43 వేలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ‘‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ కింద మేం 2023-24లో 15,000 తరగతి గదులను నిర్మించాం. మరో 15,000 నిర్మాణం పురోగతిలో ఉంది. 5,000కు పైగా కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. మరో 15,000కు సంబంధించి పనులు మొదలయ్యాయి’ అని దిండోర్‌ చెప్పారు. ప్రభుత్వ కృషి వల్ల 2022-23లో ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ నిష్పత్తి 37.22 శాతం నుంచి 2.68 శాతానికి పడిపోయిందని చెప్పారు.

‘‘పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి 2023-24 సంవత్సరంలో మొత్తం 22,349 విద్యా సహాయక్, జ్ఞాన్ సహాయక్ (కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు)లను నియమించాం. 2024-25 సంవత్సరానికి మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద రూ.2,785 కోట్లతో ప్రాథమిక పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేయనున్నాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని