Arvind Kejriwal: ‘అరెస్టు ఆశ్చర్యపర్చలేదు’: కేజ్రీవాల్ సందేశాన్ని వెల్లడించిన సతీమణి

ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌(Arvind Kejriwal) సందేశాన్ని ఆయన సతీమణి సునీత ఎక్స్ వేదికగా వెల్లడించారు. 

Updated : 23 Mar 2024 13:27 IST

దిల్లీ: భాజపా నేతలను సోదరసోదరీమణులంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంబోధించారు. తన అరెస్టు విషయంలో వారిపై ఎలాంటి ద్వేషం చూపించొద్దని కోరారు. అలాగే ఈ  అరెస్టు  ఆశ్చర్యపర్చలేదన్నారు. ఈ మేరకు ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ సందేశాన్ని ఆయన సతీమణి సునీత చదివి వినిపించారు.

‘‘సమాజం కోసం మీ పని కొనసాగించండి. భాజపాను ద్వేషించకండి. వారు మన సోదరసోదరీమణులు. దేశాన్ని బలహీనపరిచే ఎన్నో శక్తులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాంటి శక్తుల్ని గుర్తించి, ఓడించండి. మీ సోదరుడు, కుమారుడినైన నాపై  దిల్లీ మహిళలు నమ్మకం ఉంచాలని కోరుతున్నాను. నన్ను సుదీర్ఘకాలం కటకటాల వెనక ఉంచే జైలే లేదు.  త్వరలో వచ్చి, మీకిచ్చిన హామీలను నెరవేర్చుతాను’’ అని ఆయన మాటలను సునీత వెల్లడించారు.

వాట్‌నెక్స్ట్‌.. ఎన్నికల్లో ఆప్‌ను నడిపేదెవరు..?

కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టును సునీత ఖండించారు.  అధికార వ్యామోహంతో, నియంతృత్వంతో ప్రతి ఒక్కరినీ అణచివేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఆమె ధ్వజమెత్తారు. ‘ఎక్కడున్నా ఆయన జీవితం దేశానికే అంకితం. ప్రజలే అంతిమ నిర్ణేతలు. వారికి అన్ని విషయాలు తెలుసు. జైహింద్‌’ అని పోస్టు పెట్టారు.

ప్రస్తుతం జైల్లో ఉన్నా కేజ్రీవాలే(Arvind Kejriwal) ముఖ్యమంత్రి బాధ్యతలను కొనసాగిస్తారని ఆప్‌ ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ.. ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తే.. ఆ స్థానం భర్తీ చేసేందుకు పార్టీ నుంచి విద్యా శాఖ మంత్రి ఆతిశీ, వైద్య శాఖ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ పేర్లు తెరపైకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీరితో పాటు సునీత పేరు కూడా రేసులో నిలిచే అవకాశం ఉంది. ఆమె రెవెన్యూ సర్వీస్‌ మాజీ అధికారిణి. ప్రస్తుత వీడియో సందేశం తర్వాత తదుపరి సీఎం ఆమే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని