Delhi Air Quality: దిల్లీలో తగ్గని వాయు కాలుష్యం.. పాఠశాలలకు సెలవుల పొడిగింపు

దిల్లీలో గాలి నాణ్యత ప్రమాణాలు తీవ్రస్థాయిలో పడిపోవడంతో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలకు సెలవులను మరో ఐదు రోజులు పొడిగించింది.

Updated : 05 Nov 2023 11:58 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా పెరగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలలకు సెలవులను మరో ఐదు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో నవంబరు 5 వరకు ఇచ్చిన సెలవులను.. తాజాగా నవంబరు 10వ తేదీ వరకు పొడిగించింది. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ‘‘దిల్లీలో వాయు కాలుష్య తీవ్రత పెరుగుతుండటంతో ప్రాథమిక పాఠశాలలకు నవంబరు 10 వరకు సెలవులు పొడిగిస్తున్నాం. ఆరు నుంచి ఆపై తరగతుల వారికి యథావిధిగా క్లాసులు నిర్వహించుకోవచ్చు. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించే అవకాశం కూడా ఇస్తున్నాం’’ అని దిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషీ తెలిపారు.

ఆదివారం దిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) 486గా ఉంది. శనివారంతో (504గా ఉంది) పోలిస్తే స్వల్పంగా తగ్గింది. గత ఆరు రోజులుగా దేశ రాజధానిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు దిల్లీలో విషవాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలోనే ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జారీ చేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని