Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఊరట: పదవి నుంచి తప్పించాలన్న పిల్‌ విచారణకు హైకోర్టు నిరాకరణ

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిల్‌ను న్యాయస్థానం కొట్టేసింది. 

Updated : 04 Apr 2024 13:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ హైకోర్టులో ఓ కీలక అంశంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు మంగళవారం ఊరట లభించింది. జైల్లో ఉన్న ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా వేసిన పిల్‌ను జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోడాతో కూడిన బెంచ్‌ కొట్టేసింది. సీఎం పదవిలో కొనసాగాలా వద్ద అనే అంశం కేజ్రీవాల్‌ వ్యక్తిగతంగా నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. 

ఈ అంశంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బెంచ్‌ తెలిపింది. దీనిపై దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బెంచ్‌ తెలిపింది. ‘‘ప్రభుత్వం పనిచేయట్లేదని మేం ఎలా తేలుస్తాం. ఎల్‌జీ ఇందుకు సరైన వ్యక్తి. ఆయనకు మా మార్గదర్శకత్వం అవసరం లేదు. ఆయనకు సలహాలు ఇచ్చే అవకాశం మాకు లేదు. చట్ట ప్రకారం ఏం చేయాలో ఆయన ఆలోచిస్తారు’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పిటిషనర్‌కు రాష్ట్రపతి, ఎల్‌జీ వద్ద పరిష్కారం దొరుకుతుందని సూచించారు. కేజ్రీవాల్‌ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ పిల్‌ దాఖలు కావడం ఇది రెండోసారి. సూరజ్‌ సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి గత నెల 28న దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టేసింది. 

కేజ్రీవాల్‌ అంశంలో మాకు పక్షపాతం లేదు: వివరణ ఇచ్చిన అమెరికా

మరో వైపు ఈడీ అరెస్టును సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌లో.. మధ్యంతర ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం బుధవారం విచారించింది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రం చౌధరీలు వాదనలు వినిపించారు. జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ తీర్పును నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని