Delhi fire accident: జనం గుమిగూడి.. వీడియోలకు ఎగబడి..! దిల్లీ ఘటనలో ఫైర్‌ సిబ్బందికి సవాళ్లెన్నో..

దిల్లీలోని ఓ చిన్నారుల ఆస్పత్రిలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి అనేక సవాళ్లు ఎదురైనట్లు తెలుస్తోంది.

Updated : 26 May 2024 18:47 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఓ చిన్నారుల ఆస్పత్రిలో మంటలు చెలరేగి (Delhi Fire Accident) ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచివేసింది. అయితే, మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి ఘటనాస్థలంలో అనేక సవాళ్లు ఎదురైనట్లు తెలుస్తోంది. జనమంతా గుమిగూడి.. వీడియోలు తీసేందుకు ఎగబడటంతో సహాయక చర్యలకు విఘాతం కలిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా.. నీటి లభ్యత లేకపోవడం, తక్కువ ఎత్తులో విద్యుత్‌ వైర్లు ఉండటం కూడా ఆటంకం కలిగించినట్లు తెలిపాయి.

ఆక్సిజన్‌ సిలిండర్ల పేలుడుతో..

‘‘వివేక్‌ విహార్‌లోని పిల్లల ఆస్పత్రిలో శనివారం రాత్రి 11.30 సమయంలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో రెండు భవనాలకూ వ్యాపించాయి. మొత్తం 12 మంది నవజాత శిశువులను హాస్పిటల్‌ వెనుక కిటికీలోంచి బయటకు తీసుకొచ్చాం. వారిలో ఏడుగురు మృతిచెందారు. మరో అయిదుగురు చికిత్స పొందుతున్నారు’’ అని అధికారులు తెలిపారు. ఆస్పత్రిలోని ఆక్సిజన్‌ సిలిండర్ల పేలుడుతో మంటలు మరింత వేగంగా వ్యాపించినట్లు వెల్లడించారు. ఘటనాస్థలంలో నాలుగైదు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఆ సిలిండర్లు 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడినట్లు చెప్పారు.

ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి

ప్రమాద సమయంలో ఘటనాస్థలంలో చాలామంది గుమిగూడినట్లు దిల్లీ అగ్నిమాపక విభాగానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ‘‘వారంతా ప్రమాద దృశ్యాలను చిత్రీకరించడంలో నిమగ్నమయ్యారు. మంటలను ఆర్పేందుకు యత్నిస్తోన్న సిబ్బంది దగ్గరకూ వచ్చి ఆటంకం కలిగించారు. ఇలాంటి సమయంలో ప్రజలను నియంత్రించడమే అతిపెద్ద సవాలు. ఎవరైనా సరే ఇటువంటి పనులు మానుకోవాలి. అదేవిధంగా.. అక్కడ నీటి లభ్యత లేదు. పైగా.. విద్యుత్‌ తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. భవనానికి అగ్నిమాపక ఎన్‌వోసీ ఉందో లేదో తనిఖీ చేస్తున్నాం’’ అని చెప్పారు.

ఘటనపై విచారణకు ఆదేశాలు..

ఆస్పత్రిలో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న ఓ భవనంలోని బొటిక్, ప్రైవేట్ బ్యాంకుకు, మరో భవనంలోని కళ్లద్దాల షోరూమ్, ఓ దుకాణానికీ వ్యాపించాయి. ఒక స్కూటర్, అంబులెన్స్, సమీపంలోని పార్క్‌లో కొంతభాగం మంటల్లో చిక్కుకుపోయాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘దిల్లీలోని ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌తోపాటు ఎల్జీ వీకే సక్సేనాలు ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని