Delhi LG: ‘ఆప్‌ మంత్రులు బాధ్యతగా లేరు’.. కేంద్ర హోంశాఖకు ఎల్జీ ఫిర్యాదు

పాలనాపర వ్యవహారాల్లో దిల్లీ మంత్రులు సహకరించడం లేదని ఆరోపిస్తూ.. కేంద్ర హోంశాఖకు ఎల్జీ వీకే సక్సేనా లేఖ రాశారు.

Published : 08 Apr 2024 20:18 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (Delhi LG), ఆప్‌ (AAP) ప్రభుత్వం మధ్య మరో వివాదం రాజుకుంది. పాలనాపరమైన వ్యవహారాల్లో దిల్లీ మంత్రులు సహకరించడం లేదని ఎల్జీ వీకే సక్సేనా ఆరోపించారు. ఆయా శాఖల పనితీరుపై చర్చించేందుకు మంత్రులను సమావేశాలకు పిలిచినా సాకులు చెబుతూ నిరాకరిస్తున్నారని పేర్కొంటూ.. కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) జైల్లో ఉన్నవేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు, తదనంతర పరిణామాల నేపథ్యంలో.. దిల్లీలో రోజువారీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసేందుకు మంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం అవసరం. ప్రజారోగ్యం, వేసవి కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఈనెల 2న సమావేశానికి పిలిచినప్పటికీ.. మంత్రులు గోపాల్ రాయ్, కైలాశ్‌ గహ్లోత్, ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లు నిరాకరించారు. ఎన్నికల నియమావళిని సాకుగా చూపారు. వారు బాధ్యతగా వ్యవహరించడం లేదు. స్థానికుల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై నిర్లక్ష్యాన్ని వారి వైఖరి చూపుతోంది’’ అని ఎల్జీ పేర్కొన్నారు.

ఆతిశీ చెప్పిన ఆ నలుగురిలో ఒకరికి ఈడీ సమన్లు

దిల్లీలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టిస్తూ పాలనను పట్టాలు తప్పిస్తున్నారని ఎల్జీ వీకే సక్సేనాపై ఆప్‌ ప్రభుత్వం గతంలో పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా గత నెల 21న అరెస్టైన అరవింద్‌ కేజ్రీవాల్‌.. ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్నారు. అక్కడినుంచే సీఎంగా కొనసాగుతున్నారు. మద్యం పాలసీ కేసులోనే అరెస్టయిన ఎంపీ సంజయ్‌ సింగ్‌.. ఆరు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని