AAP: ఆమ్‌ఆద్మీకి ఎదురుదెబ్బ.. కేజ్రీవాల్ అరెస్టు వేళ మంత్రి రాజీనామా

దిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ (Raaj Kumar Anand) తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆప్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు.

Updated : 10 Apr 2024 17:43 IST

దిల్లీ: దిల్లీ మద్యం పాలసీ కేసులో తమ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టుతో సంక్షోభంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం దిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ (Raaj Kumar Anand) రాజీనామా చేశారు. కేబినెట్‌, పార్టీ పదవులను వదులుకున్నారు. ఆయన ఇప్పటివరకు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఈ ప్రకటన చేశారు.

‘‘ప్రజలకు సేవ చేసేందుకు, అవినీతిపై పోరాడాలన్న బలమైన సంకల్పాన్ని చూసి ఆప్‌లో చేరాను. కానీ ఈరోజు ఆ పార్టీనే అవినీతికి అడ్డాగా మారిపోయింది. అందుకే దీనిని వీడాలని నిర్ణయించుకున్నాను’’ అని రాజ్‌కుమార్ వెల్లడించారు. ఆప్‌లో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉందని ఆరోపించారు. తాను దళితుల కోసం పని చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండటం వృథా అని వ్యాఖ్యానించారు. ఆయన పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి.

అరెస్టును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు ఆప్‌ను కుదిపేస్తోంది. కేజ్రీవాల్, సీనియర్ నేతలు మనీశ్‌ సిసోదియా, సంజయ్‌సింగ్‌లు ఈ కేసులో అరెస్టయ్యారు. ఇటీవలే సంజయ్ బెయిల్‌పై బయటకు వచ్చారు. మరో కీలక నేత సత్యేందర్ జైన్ కూడా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. అలాగే అవినీతి ఆరోపణల కింద పలువురు నేతలకు దర్యాప్తు సంస్థలు సమన్లు ఇస్తోన్న విషయం విదితమే.

కేజ్రీవాల్‌ అరెస్టు లక్ష్యం ఇదే.. సంజయ్‌ సింగ్‌

మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్ స్పందించారు.  కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఉద్దేశమే తమ పార్టీని అంతం చేయడానికేనని తాము ఇప్పటికే చెప్పామన్నారు. భాజపా ఈడీ, సీబీఐని ప్రయోగించి తమ మంత్రులను, ఎమ్మెల్యేలను చీల్చుతోందని.. ఇది తమందరికీ ఓ పరీక్షలాంటిదన్నారు. ఆనంద్‌ను గతంలో అవినీతిపరుడని పిలిచిన భాజపాలోనే ఇప్పుడు ఆయన చేరబోతున్నారంటూ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు