Kejriwal: అరెస్టును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

Kejriwal: తన అరెస్టును సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయటంతో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Updated : 10 Apr 2024 10:24 IST

దిల్లీ: మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆయన తరఫున న్యాయవాది వివేక్‌ జైన్‌ బుధవారం వెల్లడించారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. ఈడీ వద్ద తగిన ఆధారాలున్నాయని.. అందుకే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అరెస్టు, రిమాండ్‌ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. మనీలాండరింగ్‌పై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్‌ చెప్పారని పేర్కొంది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని తేల్చి చెప్పింది.

మద్యం విధానం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీలోకి తీసుకొని విచారించగా.. ఏప్రిల్‌ 15 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్టును సవాల్‌ చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించాలని కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. అది వ్యతిరేకంగా ఉండటంతో కేజ్రీవాల్‌ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని