Parliament Secuirty Breach: పార్లమెంట్‌ ఘటన.. కాల్చేసిన ఫోన్లను గుర్తించిన పోలీసులు

పార్లమెంటులో అలజడి సృష్టించిన ఘటనలో ప్రధాన సూత్రధారి లలిత్‌ ఝా ధ్వంసం చేసిన ఆధారాలను పోలీసులు కనుగొన్నారు.

Published : 17 Dec 2023 17:06 IST

దిల్లీ/జైపుర్‌: పార్లమెంట్‌లో అలజడి సృష్టించిన (Parliament Security Breach) ఘటనలో ఆరుగురిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝా, కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం కాలిపోయిన ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనానంతరం లలిత్‌ దిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయి ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.

పార్లమెంట్‌లో అలజడి తర్వాత లలిత్‌ ఝా రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా త్రిశాంగ్య అనే గ్రామానికి వెళ్లాడు. అక్కడే ఓ చిన్న హోటల్‌లో బస చేసిన తన స్నేహితుడు మహేష్ కుమావత్‌ను కలిశాడు. తర్వాత ఇద్దరు కలిసి.. పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన నలుగురి ఫోన్లతోపాటు మరికొన్ని ఆధారాలను కాల్చేశారు. ఘటనకు ముందు నలుగురి నుంచి ఫోన్లు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో లలిత్‌ తెలిపాడు. మహేష్‌ కుమావత్‌ బస చేసిన హోటల్‌కు దగ్గర్లో కాలిపోయిన ఫోన్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

పార్లమెంట్‌ ఘటన తీవ్రమైన అంశం.. రాద్ధాంతం అనవసరం: ప్రధాని మోదీ

గత బుధవారం మనోరంజన్‌, సాగర్‌శర్మ అనే ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకగా.. నీలమ్‌, అమోల్‌ శిందే అనే మరో ఇద్దరు పార్లమెంట్‌ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ ఘటన మొత్తాన్ని లలిత్‌ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వాటిని వైరల్‌ చేయాలని పశ్చిమ బెంగాల్‌కు చెందిన తన మిత్రుడు సౌరవ్‌ చక్రవర్తికి పంపాడు. అనంతరం రాజస్థాన్‌ వెళ్లి ఆధారాలను ధ్వంసం చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులపై పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని