Viral news: ఇంత దారుణమా!.. పర్యాటకుడిని వెంబడించి..ఇనుపరాడ్లతో దాడి చేసి..

తాజ్‌మహల్‌ను చూసేందుకు వెళ్లిన ఓ పర్యాటకుడిపై అక్కడి యువకులు కొందరు దాడి చేశారు.దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Updated : 18 Jul 2023 15:34 IST

ఆగ్రా:  తాజ్‌మహల్‌ను చూసేందుకు వెళ్లిన పర్యాటకుడిపై అక్కడి యువకులు కొందరు దాడికి పాల్పడ్డారు. వెంబడించిమరీ దాడి చేశారు. అతడు ఓ స్వీటుషాపులోకి వెళ్లగా.. కర్రలు, ఇనుపరాడ్లతో చితక్కొట్టారు. తమలో ఒకడిని కారుతో ఢీ కొట్టాడన్న కారణంతోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

రాంగ్‌ రూట్‌లో వచ్చి.. అంబులెన్స్‌ను ఢీ కొట్టిన మంత్రి పైలట్‌ వాహనం

తాజ్‌మహల్‌ను చూసేందుకు దిల్లీ నుంచి ఓ టూరిస్టు ఆదివారం ఆగ్రాకు వెళ్లారు. బసాయ్‌చౌకి-తాజ్‌గంజ్‌ మార్గంలో కారులో వెళ్తుండగా.. పక్కన కొంతమంది భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అందులో ఒకరికి కారు తాకింది. పర్యాటకుడు కారు ఆపి.. వాళ్లకు క్షమాపణలు చెప్పారు. అయినా వారు వినిపించుకోలేదు. దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు అతడు దగ్గర్లోని స్వీటు షాప్‌లోకి పరుగెత్తాడు. అతడిని వెంబడించిన ఐదుగురు యువకులు అక్కడికి వెళ్లి ఇనుపరాడ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. వద్దని వేడుకున్నా వదల్లేదు. కొన్ని నిమిషాలపాటు చావబాది.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన సాయంత్రం 7 గంటల సమయంలో జరిగినట్లు ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది.

ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారని, వాళ్లకి ఇలాంటి పరిస్థితులే ఎదురైతే దేశం పరువుపోతుందని అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వ్యక్తం కావడంతో ఆగ్రా పోలీసులు స్పందించారు. నిందితులను అరెస్టు చేసినట్లు ట్విటర్‌లో వెల్లడించారు. నిందితులను కోర్టుకు తరలించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని