DGCA: గంటలతరబడి విమానం ఆలస్యం.. ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు

గంటలపాటు విమానం ఆలస్యం కారణంగా ప్రయాణికులు అవస్థలకు గురైన ఘటనలు వెలుగులోకి రావడంతో డీజీసీఏ (DGCA) స్పందించింది. ఎయిరిండియా (Air India)కు నోటీసులు ఇచ్చింది. 

Published : 31 May 2024 16:35 IST

దిల్లీ: కొన్ని గంటల పాటు ఎయిరిండియా (Air India) విమానం ఆలస్యం కావడంతో కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)(DGCA) స్పందించింది. ఎయిరిండియాకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఇటీవల కాలంలో కొన్ని విమానాలు గంటలకొద్దీ ఆలస్యం కావడం, ఆ సమయంలో ప్రయాణికులు అసౌకర్యానికి గురైన ఘటనలను డీజీసీఏ ఆ నోటీసుల్లో ప్రస్తావించింది.

ఎయిరిండియా (Air India)కు చెందిన ఏఐ 183 విమానం గురువారం మధ్యాహ్నం 3.20 గంటలకు దిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో (Delhi to San Francisco Flight) బయల్దేరాల్సిఉండగా.. సాంకేతిక సమస్యలు, నిర్వహణ కారణాలతో టేకాఫ్‌ ఆలస్యమైంది. దాంతో కొన్ని గంటల పాటు ప్రయాణికులు విమానంలోనే ఉండాల్సివచ్చింది. ఏసీలు పని చేయకపోవడంతో పాటు ఊపిరాడక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. దాదాపు 8 గంటల తర్వాత కొందరు స్పృహ కోల్పోవడంతో సిబ్బంది ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసినట్లు సోషల్‌ మీడియాలో ఆందోళన వ్యక్తమైంది. దీంతోపాటు పాటు కొద్దిరోజుల క్రితం ముంబయి-శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిరిండియా విమానం కూడా ఇలాగే ఆలస్యమైంది. ఈ వరుస జాప్యాల నేపథ్యంలో డీజీసీఏ స్పందించింది.

24 గంటలపాటు ఆలస్యం.. విమానంలో స్పృహ తప్పిన ప్రయాణికులు

ఈ ఘటనల వేళ.. నిబంధనల ఉల్లంఘనలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని విమానయాన సంస్థను ఆదేశించింది. మూడు రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. లేకపోతే తదుపరి చర్యలు ఉంటాయని వివరించింది. అయితే.. అనుకోని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇదివరకే ఎయిరిండియా స్పందించిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని