Shiva Rajkumar: శివ రాజ్‌కుమార్‌కు ఎంపీ టికెట్‌.. పబ్లిక్‌గా ఆఫర్‌ చేసిన డీకే

ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar)కు వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ టికెట్‌ ఇస్తామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బహిరంగంగా ఆఫర్‌ చేశారు. మరి దీనికి ఈ స్టార్‌ హీరో ఏం చెప్పారంటే..?

Updated : 11 Dec 2023 15:44 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్‌ (Congress) పార్టీ.. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar).. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar)కు పబ్లిక్‌గా ఓ ఆఫర్‌ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections) పోటీ చేయాలని ఈ స్టార్‌ హీరోను కోరారు.

బెంగళూరులో ఆదివారం ఆర్యా ఈడిగ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఈడిగ సామాజిక వర్గానికి చెందిన శివ రాజ్‌కుమార్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ.. ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని శివ రాజ్‌కుమార్‌ను కోరా. కానీ, ఆయన చాలా సినిమా షూటింగ్‌లు పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఆయనకు నేను చెప్పేది ఒకటే.. సినిమాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ, పార్లమెంట్‌కు వెళ్లే గొప్ప అవకాశం అందరికీ రాదు. మీ తలుపుతట్టిన అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. మా ఆఫర్‌ను ఒకసారి పరిశీలించండి’’ అని నటుడిని కోరారు.

నాడు నల్లడబ్బుపై ట్వీట్‌ చేసి.. నేడు నోట్లగుట్టలతో చిక్కి..!

అయితే, డీకే మాటలకు ఆ కార్యక్రమంలో స్పందించని శివ రాజ్‌కుమార్‌ ఆ తర్వాత దీని గురించి డిప్యూటీ సీఎంతో చర్చించినట్లు సమాచారం. లోక్‌సభ ఆఫర్‌ను ఆయన చాలా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ‘‘ముఖానికి రంగులద్దుకుని నటించి ప్రేక్షకులను మెప్పించడం అనేది నా తండ్రి నాకిచ్చిన బహుమతి. ప్రత్యక్ష రాజకీయాలకు మా కుటుంబం దూరంగా ఉంటుంది. రాజకీయాలతో నాకున్న ఏకైక సంబంధం.. నేను గీత (మాజీ సీఎం బంగారప్ప కుమార్తె)ను వివాహం చేసుకోవడమే. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఓ భర్తగా ఆమె ఆశయాలను నేను ప్రోత్సహిస్తాను. ఆమెకు మీరు టికెట్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చు ’’ అని శివరాజ్‌కుమార్‌ డిప్యూటీ సీఎంకు చెప్పినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.

గీత ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 2014లో ఆమె మాజీ సీఎం యడియూరప్పపై జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు గీత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమె సోదరుడు మధు బంగారప్ప తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని