నాడు నల్లడబ్బుపై ట్వీట్‌ చేసి.. నేడు నోట్లగుట్టలతో చిక్కి..!

ఒడిశా(Odisha)లో వెలుగుచేసిన నోట్ల కట్టలు చూసి దేశ ప్రజలు అవాక్కవుతున్నారు. వాటిని కాంగ్రెస్‌(Congress) ఎంపీకి చెందిన కార్యాలయాలు, నివాసాల నుంచి ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోవడంపై భాజపా(BJP) విమర్శలు గుప్పిస్తోంది.

Updated : 11 Dec 2023 12:18 IST

దిల్లీ: ఒడిశా ప్రధాన కేంద్రంగా కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహు కుటుంబం నిర్వహిస్తున్న డిస్టిలరీ కంపెనీపై ఆదాయపు పన్ను విభాగం అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.వందల కోట్లు బయటపడ్డాయి. ఐదురోజులుగా 50 మంది బ్యాంకు అధికారులు 40 కౌంటింగ్ మెషిన్లతో ఆ నోట్ల గుట్టలను లెక్కించగా.. ఇప్పటివరకు రూ.353 కోట్ల లెక్క తేలిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఓ దర్యాప్తు సంస్థ చేపట్టిన సోదాల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం దేశంలో ఇదే తొలిసారి. దీనిపై భాజపా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో పార్లమెంట్ బయట పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ వివరణ ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌, కరప్షన్ ఒకే నాణానికి రెండు ముఖాలు లాంటివి. ధీరజ్‌ సాహు వద్ద దొరికిన ఈ నల్లడబ్బు ఎవరిది..? దీనిపై సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సమాధానం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. భారీ స్థాయిలో నగదు వెలుగులోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక ఎంపీ ఇంటినుంచి ఈ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్నారు. కానీ దీనిపై ప్రతిపక్షాల ఇండియా కూటమి మాత్రం మౌనం వహిస్తోంది. కరప్షన్ అనేది కాంగ్రెస్ స్వభావం కాబట్టి ఆ పార్టీ నిశ్శబ్దంగా ఉందంటే ఓకే. జేడీయూ, ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ ఎందుకు మౌనం వహిస్తున్నాయి’ అని ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు.

ప్రస్తుతం ఈ కౌంటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చిందని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. బాలంగిర్‌లోని ఎస్‌బీఐ శాఖలో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయనున్నారు. ‘మొత్తం 176 బ్యాగుల్లో 140కి పైగా బ్యాగుల్లోని నగదు కౌంటింగ్ పూర్తయింది. మిగిలిన నగదును ఈ రోజు లెక్కిస్తాం’ అని ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ తెలిపారు.

కుంగిపోలేదు.. కెరటంలా లేచాడు

ఇదిలా ఉంటే.. గతంలో అవినీతికి వ్యతిరేకంగా ధీరజ్‌ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘డీమానిటైజేషన్ తర్వాత కూడా దేశంలో నల్లధనం, అవినీతిని చూస్తుంటే నా హృదయం బరువెక్కుతోంది. అంత నల్లడబ్బు ఎలా ఒకదగ్గర పోగుపడుతుందో నాకర్థం కావడం లేదు. ఈ దేశంలో అవినీతిని పారదోలేది కాంగ్రెస్ మాత్రమే’ అని అప్పట్లో ఆయన ట్వీట్ చేశారు. ఈ కాంగ్రెస్‌ ఎంపీ పోస్టును భాజపా నేత అమిత్‌ మాలవీయ రీట్వీట్‌ చేశారు. ‘ధీరజ్ ప్రసాద్‌ సాహుకు మంచి హాస్య చతురత ఉంది’ అని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని