Kejriwal Arrest:: సంక్షేమ పథకాలేవీ ఆగవ్‌.. ఆ రూమర్స్‌ నమ్మొద్దు: దిల్లీ సర్కార్‌ విజ్ఞప్తి

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుతో సంక్షేమ పథకాలు నిలిచిపోతాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆప్‌ సర్కార్‌ విజ్ఞప్తి చేసింది.

Updated : 26 Mar 2024 21:53 IST

దిల్లీ: ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టుతో నెలకొన్న పరిస్థితిని అవకాశంగా తీసుకొని కొన్ని శక్తులు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆప్‌(AAP) సర్కార్‌ దిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. కేజ్రీవాల్‌ అరెస్టుతో దిల్లీలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలు నిలిచిపోతాయంటూ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు చేస్తోన్న దుష్ప్రచారంపై ప్రజల్ని అప్రమత్తం చేసింది. నేర పరిశోధన ప్రక్రియలో చట్టం తన పని తాను చేస్తుందని.. పథకాల అమలు, పాలన అనేవి ఎప్పుడూ వ్యక్తులకు సంబంధించినవి కావని స్పష్టం చేసింది. సామాన్య ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ప్లానింగ్‌ విభాగం కార్యదర్శి నిహారికా రాయ్‌ ప్రకటనలో తెలిపారు. అయితే, సీఎం కేజ్రీవాల్‌ ఆదేశాల మేరకే ఈ ప్రకటన వెలువడినట్లు ఆప్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ రెండో ఆదేశాలు..

గతంలో మాదిరిగానే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు, రాయితీలు, పింఛన్లు తదితర సేవలన్నీ నిరాటంకంగా కొనసాగుతాయని నిహారిక స్పష్టంచేశారు. ప్రజా సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులతో సంఘటిత నిధి ద్వారా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారని, ఈ డబ్బు ఒక వ్యక్తి లేదా రాజకీయ పార్టీల సొంత ఆస్తులు కాదన్నారు. అందువల్ల ముఖ్యమంత్రి అరెస్టు లేదా రిమాండ్‌తో ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అస్సలు ప్రభావమేమీ ఉండదని పేర్కొన్నారు. కొన్ని స్వార్థపూరిత శక్తులు చేసే ఇలాంటి తప్పుదారి పట్టించే సమాచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మద్యం విధానం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను ఈ నెల 21న రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 28వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని