HD Kumaraswamy: రాష్ట్ర హోంమంత్రికి ప్రొటోకాల్ తెలియదా? : హెచ్‌డీ కుమారస్వామి

ప్రజ్వల్‌ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సమాచారం అందించలేదని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, ప్రజ్వల్‌ బాబాయి హెచ్‌డీ కుమారస్వామి మండిపడ్డారు.

Published : 27 May 2024 14:05 IST

బెంగళూరు: జనతాదళ్ (సెక్యులర్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు మద్దతిస్తున్నట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) తెలిపారు.  ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తామన్నారు. అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అంశం బయటకు రావడంతో యూరప్‌కు పారిపోయిన హసన్ ఎంపీ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి లేఖ రాశారు. 

 కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర (Parameshwara) మాట్లాడుతూ ‘‘రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కోరినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను స్వీకరించిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ మంత్రి  జైశంకర్ అన్నారు. అయితే, ఈ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) నుంచి తమకు ఎటువంటి రాతపూర్వక సమాచారం రాలేదు. ’’అన్న మాటలపై కుమారస్వామి మండిపడ్డారు.  

‘‘ప్రజ్వల్  పాస్‌పోర్ట్‌ను రద్దు చేసి అతడిని భారత్‌కు  రప్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ఎంఈఏను అభ్యర్థించింది. కానీ పాస్‌పోర్ట్‌ను 24గంటల్లో రద్దు చేయడం సాధ్యం కాదు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. రాష్ట్ర హోం మంత్రికి అసలు ప్రోటోకాల్ తెలుసా లేదా?’’అని కుమారస్వామి ప్రశ్నించారు.

ప్రజ్వల్‌ రేవణ్ణ అనేక మంది మహిళలను లైంగికంగా  వేధించినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుల మేరకు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసింది. ఆయన దౌత్య పాస్ పోర్ట్‌ను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని