CJI: సినిమా డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. కేసుల వరుస వాయిదాలపై సీజేఐ అసహనం

న్యాయస్థానాల్లో కేసులు వరుసగా వాయిదా పడటం వల్ల.. వాటిని వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశం సాకారం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. 

Updated : 03 Nov 2023 13:40 IST

దిల్లీ: న్యాయస్థానాల్లో కేసులు పదేపదే వాయిదా పడటంపై సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో 3,668 కేసుల్లో వాయిదాలు కోరినట్లు  వెల్లడించారు. ఈ వివరాలు వెల్లడిస్తూ.. ఆయన బాలీవుడ్‌ సినిమా దామినిలోని ‘tareek peh tareek(వాయిదా మీద వాయిదా)’ అనే డైలాగ్‌ను ప్రస్తావించారు.

‘ఈ ఒక్కరోజే 178 కేసులు వాయిదా వేయాలని డిమాండ్లు వచ్చాయి. ఈ న్యాయస్థానాలు వాయిదాల మీద వాయిదాలు వేసే వాటిగా ఉండాలని మేం కోరుకోవడం లేదు. దానివల్ల కేసుల్ని త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశం నెరవేరదు’ అని సీజేఐ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలీవుడ్ చిత్రం ‘దామిని’లో సన్నీదేఓల్ న్యాయవాదిగా నటించారు. ఆయన అత్యాచార బాధితురాలి తరఫున కేసు వాదిస్తారు. నిందితుడి తరఫు న్యాయవాది అతడిని కేసు నుంచే తప్పించే ఉద్దేశంతో వాయిదాలు కోరతాడు. ఈ క్రమంలోనే సన్నీ "tareek peh tareek" డైలాగ్‌ ఉపయోగిస్తాడు. న్యాయస్థానాల్లో ఖాళీలు, వాటి మూలంగా పెరుగుతున్న పనిభారం.. కేసుల్లో తీర్పులు ఆలస్యం అయ్యేందుకు కారణమవుతున్నాయనే వాదనా ఉంది.

దిల్లీలో తీవ్ర స్థాయిలో పొగమంచు.. దారుణంగా వాయు నాణ్యత

సుప్రీంకోర్టుతో సహా దిగువ న్యాయస్థానాల్లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మణిపుర్‌, మేఘాలయ, సిక్కిం, త్రిపుర హైకోర్టులు మాత్రమే పూర్తి సిబ్బందితో సేవలు అందిస్తున్నాయి. ఇక, పెండింగ్‌ కేసుల విషయంలో డిసెంబర్‌ 31, 2022 వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర న్యాయశాఖ పార్లమెంట్‌కు వెల్లడించింది. జిల్లా, దిగువ స్థాయి కోర్టుల్లో 4.32 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టులో 69 వేలకు పైగా, హైకోర్టుల్లో 59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఈ గణాంకాలపై అప్పటి న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ఇది న్యాయమూర్తి తప్పు కాదని, వ్యవస్థలో లోపం అని అన్నారు. ఆ లోపాన్ని సరిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని