LS Polls: తక్కువ పోలింగ్‌.. 266 లోక్‌సభ స్థానాలపై ఈసీ నజర్‌

లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ పోలింగ్‌ నమోదైన 266 స్థానాలను గుర్తించింది.

Published : 05 Apr 2024 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) పోలింగ్‌ శాతాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్‌ నమోదైన 266 స్థానాలను గుర్తించింది. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లోనూ జాతీయ సగటు (67.40) కంటే తక్కువ పోలింగ్‌ నమోదైంది. దీంతో ఈసారి అక్కడ ఓట్ల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ముందడుగు వేస్తోంది. సంబంధిత నియోజకవర్గాల సిబ్బందితో శుక్రవారం దిల్లీలో సమావేశమైన ఈసీ అధికారులు.. ఓటరు భాగస్వామ్యాన్ని పెంచేందుకు వ్యూహరచన చేశారు.

2019లో తెలంగాణ, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్మూ-కశ్మీర్‌, ఝార్ఖండ్‌లలో పోలింగ్‌ శాతం.. జాతీయ సగటు 67.40 శాతంతో పోలిస్తే తక్కువగా నమోదైంది. మొత్తం 266 నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్‌ నమోదు కాగా.. వాటిలో 215 గ్రామీణ, 51 పట్టణ ప్రాంత స్థానాలు ఉన్నాయి. పోలింగ్‌ శాతం పెంపు విషయంలో దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఒకే విధమైన వ్యూహం పనిచేయదని, సంబంధిత నియోజకవర్గాలకు అనుగుణంగా రూపొందించాలని భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ సూచించారు.

లోక్‌సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!

ప్రజలే స్వయంగా ముందుకొచ్చి ఎన్నికల ప్రక్రియలో భాగమయ్యే వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని సీఈసీ చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాల కల్పన, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లను భాగస్వామ్యం చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల ఉదాసీనతపై రూపొందించిన ఓ బుక్‌లెట్‌ను కూడా విడుదల చేశారు. లాజిస్టికల్ కార్యకలాపాల క్రమబద్ధీకరణ, ఓటర్లలో అవగాహనను పెంచేందుకు ఉద్దేశించిన ‘సిస్టమాటిక్ ఓటర్‌ ఎడ్యుకేషన్- ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP)’ ప్రోగ్రామ్‌ తదితర అంశాలపై చర్చలు జరిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని