Lok Sabha polls: లోక్‌సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!

సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Updated : 04 Apr 2024 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించే సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections)ను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దాదాపు 95 కోట్లమంది ఓటర్లున్న దేశంలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం ఉండేలా చూసేందుకు భారీ కసరత్తు చేస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలినాళ్లలో ఎన్నో సవాళ్లతో పాటు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా  1957 (రెండో సాధారణ) ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా పలు పోలింగ్‌ కేంద్రాల్లో వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిని ఎన్నికల సంఘం (Election Commission) పలు సందర్భాల్లో వెల్లడించింది.

LS polls: ఎన్నికల నియమావళి.. తొలి ‘కోడ్‌’ కూసింది అప్పుడే!

  • మద్రాస్‌ రాష్ట్రానికి చెందిన ఒక ఓటరు ఎన్నికల్లో ఎవ్వరికీ ఓటు వేయనని భీష్మించుకు కూర్చున్నాడు. ప్రచారంతో రాజకీయ పార్టీలు తనను ఎంతగానో వేధించాయని, అందుకే అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC)గా ఉన్న సుకుమార్‌ సేన్‌కే తాను ఓటు వేస్తానని చెప్పడం విశేషం.
  • ఓ జిల్లాకు చెందిన ఓటరు.. బ్యాలెట్‌ బాక్సును ‘ఆరాధ్య వస్తువుగా’ భావించాడు. ఓటు వేసే ముందు దానికి పూజలు చేస్తూ కనిపించాడు. మరికొన్ని చోట్ల కూడా ఓటర్లు వాటిని పూజించే వస్తువుగా భావించి, పూలను వదిలివెళ్లారు.
  • మద్రాస్‌లో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన ఓ మహిళా ఓటరు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ‘ఈ రోజుల్లో కింగ్‌ మేకర్‌, మినిస్టర్‌ మేకర్‌ నీవే. పాత రోజుల్లో మాదిరిగా తక్కువ ధరకు బియ్యం అందించండి’ అని బ్యాలెట్‌ బాక్సును ఉద్దేశించి పేర్కొన్న సందర్భాలూ ఉన్నాయి.
  • కొన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో బ్యాలెట్‌ బాక్సులు తెరిచినప్పుడు విభిన్న వస్తువులు కనిపించాయట. తమ అభ్యర్థి విజయం సాధించాలని కొందరు, దుర్భాషలాడుతూ మరికొందరు చీటీలను బ్యాలెట్‌ బాక్సులో వేశారు. నాణేలు, కరెన్సీనోట్లు, హాలీవుడ్‌ నటుల ఫొటోలూ వాటిలో వదిలేయడం గమనార్హం.
  • పోలింగ్‌ కేంద్రాల్లోకి క్రూరమృగాలు వచ్చిన సందర్భాలున్నాయి. పోలింగ్‌కు ముందురోజు రాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో పులి (Panther) ప్రవేశించి కాసేపటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు పోలింగ్‌ పూర్తయిన తర్వాత సిబ్బంది తిరుగు ప్రయాణంలో వారి జీపునకు అతిసమీపంలోకి ఆ క్రూరమృగం మళ్లీ వచ్చి ఆగింది. కేవలం పది అడుగుల దూరంలోనే అడ్డుగా నిలబడింది. కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
  • మధ్యప్రదేశ్‌లోనూ ఓ పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చిన పులి.. అక్కడ నిద్రిస్తున్న ఓ వ్యక్తి కాలు పట్టుకొని లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది.
  • న్యూదిల్లీ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి.. నామినేషన్‌లో తనను తాను దైవంతో పోల్చుకోవడం గమనార్హం. చివరకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ దాన్ని తిరస్కరించారు.
  • 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల సమయంలో 494 స్థానాలుండేవి. వీటికి మొత్తంగా 1519 మంది పోటీ చేశారు. 19.3 కోట్ల ఓటర్లు ఉండగా.. 45.44 శాతం పోలింగ్‌ నమోదైంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని