Election Commission: ‘పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యం’.. నియోజకవర్గాల వారీగా లెక్కలు వెల్లడి

లోక్‌సభ ఎన్నికల తొలి అయిదు దశలకు సంబంధించి నమోదైన మొత్తం ఓట్ల వివరాలను ఈసీ విడుదల చేసింది.

Published : 25 May 2024 18:34 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి అయిదు దశలకు సంబంధించి నమోదైన ఓట్ల వివరాలను ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల గణాంకాలను తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దేశంలో ఎన్నికల ప్రక్రియకు హాని కలిగించేలా ఒక క్రమపద్ధతిలో తప్పుడు కథనాల వ్యాప్తి, దుర్మార్గపు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈసందర్భంగా ఆరోపించింది. పోలైన ఓట్ల సంఖ్యలో మార్పులు చేయడం అసాధ్యమని మరోసారి స్పష్టంచేసింది.

ఓటింగ్‌ పూర్తయిన 48 గంటల్లోగా ప్రతీ పోలింగ్‌ కేంద్రం వారీగా ఓటింగ్‌ శాతాలను ఈసీ వెబ్‌సైట్‌లో ఉంచాలని అభ్యర్థిస్తూ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)’ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే అయిదు దశల పోలింగ్‌ ముగిసి.. మరో రెండు దశలు మాత్రమే మిగిలిఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఈసీకి ఆదేశాలు జారీ చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం

ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నవారి కచ్చితమైన సంఖ్యను వెల్లడించేందుకు ‘ఓటర్‌ టర్నవుట్‌’ డేటా ఫార్మాట్‌ను మరింత విస్తరించాలని నిర్ణయించినట్లు ఈసీ తెలిపింది. మొత్తం ఓటర్ల సంఖ్య, నమోదైన పోలింగ్ శాతం ద్వారా ఎంతమంది ఓటేశారనేది తెలుసుకోవచ్చని పేర్కొంది. ఈ రెండు వివరాలు ఇప్పటికే ప్రజల వద్ద అందుబాటులో ఉన్నాయని గుర్తు చేసింది. పోలింగ్‌ శాతాన్ని విడుదల చేస్తున్న ఈసీ.. నమోదైన ఓట్ల సంఖ్యనూ వెల్లడించాలని డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఈమేరకు స్పందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని