Modi: ‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!

ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం.

Published : 23 Apr 2024 16:04 IST

దిల్లీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(Modi) చేసిన ‘చొరబాటుదారు’ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి (EC) ఫిర్యాదు అందింది. దానిని తాము పరిశీలిస్తున్నామని ఈసీ వర్గాలు వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఇటీవల రాజస్థాన్‌లోని బాంస్వాడాలో జరిగిన ర్యాలీలో మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ‘ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్‌ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలవడం మీకు సమ్మతమేనా?’’ అని ప్రధాని ఓటర్లను ప్రశ్నించారు. తన వాదనకు మద్దతుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు.

మాటలు.. మంటలు

దీనిపై కాంగ్రెస్‌ సహా ఇతర విపక్ష పార్టీలు మండిపడ్డాయి. తమ మేనిఫెస్టోలో హిందూ-ముస్లిం అని ఎక్కడ ఉందో ప్రధాని చూపాలని హస్తం పార్టీ  డిమాండ్ చేసింది. ‘‘ఏళ్లతరబడి భారత్‌లో నివసిస్తున్న మైనార్టీలు చొరబాటుదారులా? గతంలో ఏ ప్రధాని కూడా ఇలా మాట్లాడలేదు. మోదీకి ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వాలి’’ అని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. అభిషేక్‌ మను సింఘ్వి, గుర్దీప్‌ సప్పల్‌లతో కూడిన కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌తోపాటు కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌సింగ్‌ సంధులను కలిసి ప్రధానితోపాటు భాజపాపై మొత్తం 16 ఫిర్యాదులు అందజేసింది. ఈ క్రమంలోనే ఈసీ వర్గాల నుంచి స్పందన వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు