icon icon icon
icon icon icon

మాటలు.. మంటలు

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపదంతా ముస్లింలకు పంచుతుందని రాజస్థాన్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Published : 23 Apr 2024 05:11 IST

మోదీ వ్యాఖ్యలపై భగ్గుమన్న విపక్షాలు
ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ ప్రతినిధులు
మన్మోహన్‌ వ్యాఖ్యల వీడియో విడుదల చేసిన భాజపా

దిల్లీ, కొచ్చిన్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపదంతా ముస్లింలకు పంచుతుందని రాజస్థాన్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఇవి దారి తీశాయి. దేశ వనరులపై మైనార్టీలదే తొలి హక్కని గతంలో యూపీఏ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలనే ప్రధాని చెప్పారని అధికారపక్షం చెబుతుండగా, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అభిషేక్‌ మను సింఘ్వి, గుర్దీప్‌ సప్పల్‌లతో కూడిన కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌తోపాటు కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌సింగ్‌ సంధులను కలిసి ప్రధానితోపాటు భాజపాపై మొత్తం 16 ఫిర్యాదులు అందజేసింది. సూరత్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ను ఆర్వో తిరస్కరించడం, భాజపా ప్రకటనల్లో పదే పదే మతపరమైన విషయాల ప్రస్తావన, దూరదర్శన్‌ లోగోను కాషాయ రంగులోకి మార్చడం, ఎన్నికల సమయంలో యూజీసీ తాజా నియామకాలపై కూడా ఫిర్యాదు చేశారు. ‘‘దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో ఉన్నాయి. ప్రధాని మాత్రం అంతా బాగున్నట్లు మాట్లాడుతున్నారు. ‘అబద్ధాల వ్యాపారం’ ముగింపుదశ దగ్గరపడింది’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్‌ రూపొందించిన తాజా ప్రకటనను ఆయన జత చేశారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో గురించి అవగాహన కల్పించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌మెంటు కోరినట్లు ఆ పార్టీ సోమవారం వెల్లడించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ కొచ్చిన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మోదీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా లక్షమంది సంతకాలతో ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు.. మోదీ ఉన్నదే చెప్పారంటూ 2006 డిసెంబరు 9న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన ప్రసంగానికి సంబంధించిన 22 సెకన్ల వీడియోను భాజపా సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. కాంగ్రెస్‌కు తమ ప్రధానిపైనే నమ్మకం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.  

నాడు మన్మోహన్‌ ఏం చెప్పారంటే..

భాజపా విడుదల చేసిన వీడియోలో మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా వారికి సాధికారత కల్పిస్తూ మేం వినూత్న ప్రణాళికలు తీసుకురాబోతున్నాం. దేశంలోని వనరులపై వారికే తొలిహక్కు ఉండాలి’’ అని చెబుతున్నట్లుగా ఉంది. ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై ఏర్పాటుచేసిన జాతీయ అభివృద్ధి మండలి 52వ సమావేశంలో మన్మోహన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివాదం చెలరేగడంతో ‘వనరులపై తొలిహక్కు’ అనే మాటను ఎస్సీ/ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలు, మహిళలు, చిన్నారులందరినీ ఉద్దేశించి తాను అన్నట్లుగా మన్మోహన్‌ అప్పట్లో వివరణ ఇచ్చారు.


ప్రధాని వ్యాఖ్యలపై ఎవరు ఏమన్నారంటే..

మరో పుతిన్‌ తయారవుతున్నారు

- అమరావతి ఎన్నికల సభలో శరద్‌ పవార్‌

మాజీ ప్రధానులైన జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ నవభారతాన్ని నిర్మించేందుకు ఎంతో కృషి చేశారు. ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం ప్రజల్లో భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీరును మోదీ అనుకరిస్తున్నారు. భారత్‌లో మరో పుతిన్‌ తయారవుతున్నారు. పదేళ్లలో తాము ఏమిచేశామన్నది చెప్పకుండా, పదే పదే కాంగ్రెస్‌పై ఇలా దాడి చేయడం తెలివైన నిర్ణయం కాదు.


మోదీకి ఈసీ నోటీసు ఇవ్వాలి

- కపిల్‌ సిబల్‌.. ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు

భారత చరిత్రలో రాజకీయ చర్చ ఇంతగా ఎన్నడూ దిగజారలేదు. గతంలో ఏ ప్రధాని కూడా ఇలా మాట్లాడలేదు. ఏళ్లతరబడి భారత్‌లో నివసిస్తున్న మైనార్టీలు చొరబాటుదారులా? ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ అంటే ఇదేనా! ఇది ఆరెస్సెస్‌ సంస్కృతి కూడా కాదు. ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేశంలోని మేధావులు దీనిపై స్పందించాలి. నరేంద్ర మోదీకి ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వాలి.


సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి

- సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

ప్రధాని వ్యాఖ్యలు దారుణంగా ఉండగా, ఈసీ మౌనం పాటించడం ఇంకా దారుణం. మోదీ మాట్లాడిన తీరు ఎన్నికల నియమావళిని, విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడమే. దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణించి, కోర్టు ధిక్కారం కింద మోదీకి నోటీసు జారీ చేస్తుందని ఆశిస్తున్నా.


మోదీ పాలనలో మహిళల బంగారానికి ఎసరు

- జైరాం రమేశ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

భారతీయ మహిళలకు చెందిన బంగారు ఆభరణాలు భారీగా అమ్ముకోవడం, తనఖా పెట్టడాన్ని పర్యవేక్షించిన ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోతారు. పెద్దనోట్ల రద్దు, పేలవంగా రూపొందించిన జీఎస్టీ విధానం, ప్రణాళిక లేని లాక్‌డౌన్‌లు, దారుణంగా ఉన్న కొవిడ్‌ సహాయక ప్యాకేజీలు భారత్‌లోని పలు కుటుంబాలను అప్పుల్లోకి నెట్టాయి.


కాంగ్రెస్‌ అలా చెప్పినట్లు ప్రపంచానికి చూపగలరా?

- పి.చిదంబరం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

మోదీలా గతంలో మరే ప్రధాని కూడా మాట్లాడినట్లు నాకు గుర్తులేదు. ప్రజల ఆస్తులు సర్వే చేసి ముస్లింలకు పంచుతామని కాంగ్రెస్‌ ఎప్పుడు, ఎక్కడ చెప్పిందో భాజపా ప్రపంచానికి చెప్పగలదా? మన్మోహన్‌ వ్యాఖ్యలను వక్రీకరించడం ఆయనపై అపవాదు వేయడమే. ఇది సిగ్గుచేటు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img