Arvind Kejriwal: మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్‌ ఫోన్‌పై ఈడీ ఫోకస్‌

దిల్లీ మద్యం పాలసీ రూపొందించే సమయంలో కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్‌పై ఈడీ దృష్టిసారించింది. అందులోనే కీలక ఆధారాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ భావిస్తోంది.

Published : 25 Mar 2024 00:11 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన కేసులో దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఉపయోగించిన ఫోన్‌ కనిపించడంలేదని తెలుస్తోంది. ఈడీ (ED) కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ఆదివారం దర్యాప్తు అధికారులు నాలుగు గంటలపాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్‌ ఉపయోగించారని అధికారులు ప్రశ్నించగా.. తనకు గుర్తులేదని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. అందులోనే కీలక ఆధారాలు ఉన్నట్లు ఈడీ భావిస్తోంది. దాన్నుంచి ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్‌ మహేంద్రుతో ఆయన మాట్లాడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా వ్యక్తగత కార్యదర్శి సి.అరవింద్‌తో కలిపి కేజ్రీవాల్‌ను మంగళవారం విచారించనుంది. 

జైలు నుంచే తొలి ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్‌..!

ఈ కేసులో కేజ్రీవాల్‌ కింగ్‌పిన్‌గా వ్యవహరించారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. సౌత్‌ గ్రూప్‌కు, దిల్లీ ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఆప్‌ మీడియా విభాగం ఇన్‌ఛార్జ్‌ విజయ్‌ నాయర్‌ వ్యవహరించారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. దీని ద్వారా కేజ్రీవాల్‌ కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నారని కోర్టుకు తెలిపింది. ఆయన అరెస్టుతో దిల్లీ సీఎం రేసులో ఆప్‌ నేత ఆతిషీ, సౌరభ్‌ భరద్వాజ్‌, గోపాల్‌ రాయ్‌, కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, తొలి ప్రాధాన్యం సునీతకే ఇస్తారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని