Mahua Moitra: లోక్‌సభ ఎన్నికల వేళ.. మహువాపై మనీలాండరింగ్‌ కేసు

మహువా మొయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలపై ‘ఈడీ’ మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Updated : 02 Apr 2024 22:30 IST

కోల్‌కతా: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లోక్‌పాల్‌ ఆదేశాలతో ఇప్పటికే సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో తాజాగా మహువాతోపాటు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలపై ‘ఈడీ’ మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సీబీఐ ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించాయి.

ఈ వ్యవహారానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో మహువా, హీరానందానీలకు ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. అయితే..  వారిద్దరూ హాజరు కాలేదు. మరోవైపు.. సీబీఐ తన దర్యాప్తు ముమ్మరం చేసింది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని మొయిత్రా నివాసంతో పాటు ఇతర నగరాల్లో ఆమెకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు.

మహువా మొయిత్రా vs రాజమాత.. బెంగాల్‌లో ఆసక్తికర పోరు

అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేలా ప్రశ్నలు అడిగేందుకు హీరానందానీ నుంచి మొయిత్రా రూ.2 కోట్లతోపాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే ఆరోపించిన విషయం తెలిసిందే. లోక్‌సభ నైతిక విలువల కమిటీ నివేదిక ఆధారంగా.. గతేడాది డిసెంబరులో ఆమె లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది. తాను ఏ తప్పు చేయలేదని ఖండించిన ఆమె.. బహిష్కరణ వేటుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మహువా మరోసారి కృష్ణానగర్‌ నుంచి బరిలో దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని