Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ గైర్హాజరు.. సమన్లు వాపస్‌ తీసుకోవాలని లేఖ..!

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఈడీ ఎదుట హాజరు కావడంలేదు. తనకు జారీ చేసిన సమన్లు వాపస్‌ తీసుకోవాలని ఈడీకి ఆయన లేఖ రాశారు. ఈ దశలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు అధికారులు ముందు జాగ్రత్త భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Updated : 02 Nov 2023 16:14 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు (Delhi excise policy scam case)లో తనకు జారీ చేసిన సమన్లు వాపస్‌ తీసుకోవాలని  దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఈడీకి లేఖ రాశారు. అవి పూర్తిగా రాజకీయ కక్షతో జారీ చేసినవని అభివర్ణించారు. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం ఈ రోజు (నవంబర్‌ 2) ఆయన ఈడీ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయనకు సమన్లు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ కార్యాలయం సమీపంలో ఆప్‌ కార్యకర్తలు గుమిగూడకుండా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 

తుగ్లక్‌ రోడ్డులోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసు యంత్రాంగం పలు వరుసల్లో బారికేడ్లను ఏర్పాటు చేసింది. భారీ సంఖ్యలో పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. అలాగే డీడీయూ మార్గ్‌లోని భాజపా కార్యాలయానికి వెళ్లే మార్గంలో, ఐటీఓ ప్రాంతంలోని ఆప్‌ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దాంతో ఇండియా గేట్‌, వికాస్ మార్గ్‌, ఐటీఓ ప్రాంతంలో కొద్దిమేర ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. కేజ్రీవాల్‌ (Arvind Kejriwal).. రాజ్‌ఘాట్ వద్ద నివాళి అర్పించేందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలియడంతో అక్కడ భద్రతను పెంచారు.

హ్యాకింగ్‌పై ముందే హెచ్చరించిన కేంద్రం

ఈడీ సమన్లపై తాజాగా కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘ఆ సమన్లు చట్టవిరుద్ధమైనవి. రాజకీయ ప్రేరేపితమైనవి. భాజపా సూచన మేరకే వాటిని పంపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నన్ను దూరం చేసేందుకు వీటిని జారీ చేశారు. తక్షణమే సమన్లను ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే నేడు ఈడీ ఎదుట హాజరుకాకూడదని నిర్ణయించుకున్న ఆయన.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌మాన్‌తో కలిసి మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఈడీ ఆయనకు కొత్త తేదీతో మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.

ఈ సమన్ల నేపథ్యంలో ఇదివరకు ఆప్‌ నేతలు కేజ్రీవాల్ అరెస్టుపై అనుమానం వ్యక్తం చేశారు. ‘‘నవంబరు 2న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు సమాచారం అందింది. ఒకవేళ ఆయన అరెస్టయితే.. అవినీతి ఆరోపణలపై మాత్రం కాదు. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే..! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఆమ్‌ ఆద్మీ పార్టీ రెండు సార్లు ఓడించింది. మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఆప్‌ చేతిలో ఆ పార్టీ ఓటమిపాలైంది. కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేమని భాజపాకు అర్థమైంది. అందుకే ఇలా తప్పుడు కేసులు పెడుతోంది’’ అని దిల్లీ మంత్రి అతిషీ విమర్శించిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని