Arvind Kejriwal: కేజ్రీవాల్ ఫోన్‌లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ

Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఫోన్‌ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్‌ మంత్రి ఆతిశీ ఆరోపించారు.

Updated : 29 Mar 2024 12:27 IST

దిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై దిల్లీ మంత్రి, ఆప్‌ నాయకురాలు ఆతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సంస్థ భాజపా రాజకీయ ఆయుధంగా పనిచేస్తోందని దుయ్యబట్టారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఫోన్‌ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ఈడీ (ED) ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఆతిశీ (Atishi) శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగించాలని కోరుతూ ఈడీ గురువారం కోర్టులో వినిపించిన వాదనల గురించి ప్రస్తావించారు. ‘‘మనీలాండరింగ్‌ దర్యాప్తు జరుగుతున్న ‘మద్యం విధానం’ 2021-22లో కొన్ని రోజుల పాటు అమల్లో ఉంది. ఆ సమయంలో సీఎం ఉపయోగించిన ఫోన్‌ ఇప్పుడు లేదు. ప్రస్తుతం ఆయన వినియోగిస్తున్న మొబైల్‌ను కొన్ని నెలల క్రితమే తీసుకున్నారు. కానీ, ఈ కొత్త ఫోన్‌ పాస్‌వర్డ్‌లను ఈడీ అడుగుతోంది. దీన్ని బట్టి భాజపా (BJP) రాజకీయ ఆయుధంగా ఈడీ పనిచేస్తోందని రుజువైంది’’ అని ఆమె దుయ్యబట్టారు.

కేజ్రీవాల్‌ పాస్‌వర్డులు చెప్పలేదు

కేసు దర్యాప్తు కోసం ఈడీ పాస్‌వర్డ్‌లు అడగటం లేదని, కేజ్రీవాల్‌ ఫోన్‌లో ఏముందో తెలుసుకునేందుకు ఇది భాజపా చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. ‘‘ఆప్‌ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలతో జరిపిన చర్చలు, మీడియా-సోషల్‌ మీడియా ప్రచారానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆతిశీ ఆరోపించారు.

ఈ కేసులో కేజ్రీవాల్‌ కస్టడీని న్యాయస్థానం ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన విచారణ సందర్భంగా ఈడీ తన వాదనలు వినిపించింది. సీఎంకు సంబంధించిన ప్రాంగణాల్లో ఈ నెల 21న జరిపిన సోదాల్లో జప్తు చేసిన 4 డిజిటల్‌ పరికరాల పాస్‌వర్డులు, లాగిన్‌ వివరాలను ఆయన చెప్పలేదని దర్యాప్తు సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు