LS Polls: కోడ్‌పై ఈసీకి ‘విజిల్‌’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు

LS Polls: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్‌’ (C-Vigil) యాప్‌ ద్వారా రెండు నెలల్లో దాదాపు 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ తాజాగా వెల్లడించింది.

Published : 18 May 2024 18:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల సమయంలో ప్రజల నుంచి కోడ్‌ ఉల్లంఘనలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘సీ-విజిల్‌ (C-Vigil)’ యాప్‌నకు విపరీతంగా తాకిడి పెరిగింది. కేవలం రెండు నెలల్లోనే దీనికి 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ (Election Commission) తాజాగా వెల్లడించింది. వీటిలో ఇప్పటికే మెజార్టీ ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపింది.

‘‘మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటినుంచి ఇప్పటివరకు కోడ్‌ ఉల్లంఘనలపై (Model Code of Conduct) 4,24,317 ఫిర్యాదులు అందాయి. ఇందులో 4,23,908 ఫిర్యాదులను పరిష్కరించాం. దాదాపు 89 శాతం కేసులను 100 నిమిషాల్లోనే ఛేదించాం. ఇంకా 409 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి’’ అని ఈసీ వెల్లడించింది. నమోదైన కేసుల్లో అత్యధికం (3.24 లక్షలు) అక్రమ బ్యానర్లు, పోస్టర్లపైనే వచ్చాయని తెలిపింది.

పోలింగ్‌ శాతాలపై అధికారిక సమాచారాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వలేరు?

ఆస్తులను పాడుచేయడంపై 14,022.. నగదు, మద్యం, బహుమతుల పంపిణీపై 7,022.. గడువు ముగిసిన తర్వాత ప్రచారంపై 4,742.. మతపరమైన ప్రసంగాలపై 2,883.. మారణాయుధాలతో బెదిరింపులపై 2,430 ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించేందుకు ‘సీ-విజిల్‌’ అనేది పౌరుల చేతుల్లో ఉన్న సమర్థమంతమైన సాధనమని పేర్కొంది.

సీ-విజిల్‌ అనేది ఎన్నికల సంఘం రూపొందించిన ఫాస్ట్‌ ట్రాక్‌ మొబైల్‌ యాప్‌. ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘనలపై సాక్ష్యాధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు. వీటిని ఈసీ నిమిషాల్లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా నగదు, మద్యం, మాదక ద్రవ్యాల పంపిణీ, తాయిలాలతో ప్రలోభపెట్టడం, రెచ్చగొట్టే ప్రసంగాలు, అసత్యాలు ప్రచారాలకు సంబంధించి ఏవైనా ఫొటోలు, వీడియోలు ఈ యాప్‌ ద్వారా ఈసీకి పంపించవచ్చు. మొత్తం మీద 100 నిమిషాల్లో ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు