Erode MP: టికెట్‌ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత

Erode MP Ganeshamurthi Suicide: టికెట్‌ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్‌ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు.

Updated : 28 Mar 2024 12:57 IST

కోయంబత్తూర్‌: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడు (Tamil Nadu)లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈరోడ్‌ (Erode) ఎంపీ, ఎండీఎంకే నేత గణేశమూర్తి (77) కన్నుమూశారు. ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో ఇటీవల ఆయన ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకే (DMK) కూటమిలో ఎండీఎంకే (MDMK)కు ఈరోడ్‌ స్థానం దక్కింది. అక్కడి నుంచి గణేశమూర్తి (Ganeshamurthi) ఉదయించే సూర్యుడి (డీఎంకే) గుర్తుపైనే పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించగా.. అక్కడి నుంచి దురైవైగోను పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

కసబ్‌ను పట్టుకున్న సదానంద్‌ దాతెకు ఎన్‌ఐఏ పగ్గాలు

ఈ క్రమంలోనే మార్చి 24న ఉన్నట్టుండి ఆయన అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్చారు. విషపూరిత ట్యాబ్లెట్లు మింగి ఎంపీ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ తర్వాత పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. ఈ ఉదయం పరిస్థితి విషమించడంతో  కన్నుమూసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

1947 జూన్‌లో జన్మించిన గణేశమూర్తి.. 1993లో ఎండీఎంకే ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్నారు. 1998లో తొలిసారిగా పళని లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన.. 2009లో ఈరోడ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో ఓటమి పాలై, గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి దాదాపు 2లక్షల భారీ మెజార్టీతో మరోసారి విజయం సాధించారు. 2016లో పార్టీ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని