Upendra Dwivedi: ట్రంప్‌ ఎప్పుడేం చేస్తారో ఆయనకే తెలియదు: ఉపేంద్ర ద్వివేది

Eenadu icon
By National News Team Published : 02 Nov 2025 12:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చితులు, భద్రతా సవాళ్లను ఎదుర్కొనేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భారత ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని.. పాత సమస్యలు పరష్కరించుకునేలోపే కొత్తవి వస్తున్నాయన్నారు. ప్రపంచ దేశాల మధ్య.. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Trump) ఈ రోజు ఏం చేస్తున్నారు.. రేపు ఏం చేయబోతున్నారు..? అనే విషయం ఆయనకు కూడా తెలియకపోవచ్చని ద్వివేది వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన ద్వివేదీ మాట్లాడుతూ.. గతంలో వ్యతిరేక భావజాలం, భూభాగాల స్వాధీనం కోసం చేసే యుద్ధాలు అందరి కళ్లకు కనిపించేవని.. ప్రస్తుతం కొత్త వ్యూహాలతో దేశాలు పరస్పరం యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాయని అన్నారు. ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్‌ దాడులు, తప్పుడు ప్రచారాల వంటి సవాళ్లను మన సైన్యం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో తాము కేవలం పాక్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని.. అయితే ఆ దేశ పౌరుల పైనా దాడులకు పాల్పడినట్లు సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయని అన్నారు. ఇలాంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సైన్యం ఆయుధపరంగానే కాకుండా టెక్నాలజీ పరంగానూ మరింత ముందుకు వెళ్లాలన్నారు.  

ఆపరేషన్‌ సిందూర్‌ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆధునిక ఘర్షణలను ఎదుర్కోవడానికి భారత్‌ సమాయత్తమవుతుందని ద్వివేది తెలిపారు. ఇందుకోసం త్రివిధ దళాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలను ఆపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) తరచూ గొప్పలు చెప్పుకోవడం, ప్రపంచ దేశాలపై ఇష్టానుసారం సుంకాలు విధించడం వంటి చర్యల నేపథ్యంలో ద్వివేది ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు