Gautam Adani: ప్రతి అవరోధం.. అభివృద్ధికి సోపానం: గౌతమ్‌ అదానీ

Eenadu icon
By National News Team Updated : 01 Dec 2024 23:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

జైపుర్: అదానీ గ్రూప్‌, అనుబంధ సంస్థలపై అమెరికాలో కేసులు నమోదైన నేపథ్యంలో ఆ సంస్థ అధిపతి గౌతమ్‌ అదానీ (Gautam Adani) స్పందించారు. తమపై జరిపే ప్రతీ దాడి తమని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇలాంటి కేసులు ఎదుర్కోవడం అదానీ సంస్థలకు కొత్తకాదని అన్నారు. రాజస్థాన్‌లోని జైపుర్‌లో నిర్వహించిన 51వ జెమ్‌ అండ్‌ జ్యూవెలరీ అవార్డ్స్‌ ప్రదానోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘అదానీ సంస్థలపై రెండు వారాల కిందట అమెరికాలో వచ్చిన ఆరోపణల గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి సవాళ్లు సంస్థకు కొత్తేం కాదు. మనపై జరిగిన ప్రతీ దాడి మనల్ని మరింత బలపడేలా చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. సంస్థకు ఎదురైన ప్రతి అవరోధం.. అభివృద్ధికి సోపానంగా మారుతుంది. అదానీ సంస్థలపై ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఎఫ్‌సీపీఏ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లుగానీ, న్యాయాన్ని అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్లుగానీ రుజువు కాలేదు.

సంస్థకు చెందిన కనీసం ఒక్క వ్యక్తిపైనా ఇప్పటివరకు చర్యలు లేవు. నేటి ప్రపంచంలో వాస్తవాలకంటే.. అబద్ధాలే వేగంగా వ్యాపిస్తున్నాయి. అదానీ గ్రూప్‌ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. వీటితోపాటు ఎదుర్కొన్న సవాళ్లు కూడా పెద్దవే. ఎన్ని సవాళ్లు ఎదురైనా అదానీ సంస్థల్ని విచ్ఛిన్నం చేయలేవు. అవి మనల్ని మరింత దృఢంగా తయారు చేస్తాయి. ప్రతి పతనం.. మనలో అచంచలమైన నమ్మకాన్ని కలిగిస్తుంది. మరింత బలంతో ముందుకు కదిలేందుకు దోహదపడుతుంది’’ అని అదానీ పేర్కొన్నారు.

సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత్‌లో పెద్దఎత్తున లంచాలు ఇచ్చారని అదానీ గ్రూప్‌ అనుబంధ సంస్థలపై ఇటీవల అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్లు లంచాలు ఆఫర్‌ చేసినట్లు న్యూయార్క్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అనంతరం అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్‌ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్‌ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.

Tags :
Published : 01 Dec 2024 00:04 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు