Kangana Ranaut: కాంగ్రెస్‌ మహిళా నేత అభ్యంతరకర పోస్ట్‌..! మండిపడ్డ కంగన

తనపై వచ్చిన ఓ అభ్యంతరకర పోస్టుపై కంగనా రనౌత్‌ మండిపడ్డారు. ప్రతీ మహిళ గౌరవానికి అర్హురాలని పేర్కొన్నారు.

Published : 25 Mar 2024 21:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections) భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut)కు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్ట్‌ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ మహిళానేత సుప్రియ (Supriya Shrinate) ఇన్‌స్టాగ్రామ్‌ అధికారిక ఖాతాలో ఇది కనిపించడంతో భాజపా (BJP) వర్గాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశాయి. మరోవైపు కంగన స్పందిస్తూ.. ప్రతీ మహిళ తన గౌరవానికి అర్హురాలని పేర్కొన్నారు.

‘‘క్వీన్‌లో అమాయక పాత్ర నుంచి తలైవిలో శక్తిమంతమైన మహిళా నేత వరకు.. మణికర్ణికలో దేవత పాత్ర నుంచి చంద్రముఖిలో దెయ్యం పాత్ర వరకు.. 20 ఏళ్ల నా సినీ కెరీర్‌లో ఇలా అనేక రకాల పాత్రల్లో నటించాను. మహిళలను దురాభిమానపు సంకెళ్ల నుంచి కాపాడుకోవాలి. సెక్స్‌ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ ఇతరులను దూషించడం మానుకోవాలి. ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలు’’ అని కంగనా రనౌత్‌ పేర్కొన్నారు.

నాడు హిమాచల్‌ను వద్దనుకున్న కంగన.. పాత ట్వీట్‌ వైరల్‌

అయితే.. ఆ పోస్టు తాను చేసింది కాదని సుప్రియా తెలిపారు. ‘‘నా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల యాక్సెస్‌ చాలామంది వద్ద ఉంది. వారిలో ఒకరు ఈ అభ్యంతరకర పోస్ట్‌ పెట్టారు. నా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని తొలగించాను. నేను ఏ మహిళ గురించి కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయను. ఆ విషయం నాతో పరిచయం ఉన్న అందరికీ తెలుసు. నా పేరుతో సృష్టించిన నకిలీ ఖాతాలో ఉన్న సంబంధిత పోస్టును ఇక్కడా వేశారు. ఆ పని ఎవరో చేశారో తేల్చే పనిలో ఉన్నాను. నకిలీ ఖాతాపైనా ‘ఎక్స్‌’లో ఫిర్యాదు చేశాను’’ అని వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని