Delhi Excise Policy Case: మద్యం కేసు.. మరో ఆప్‌ మంత్రిని ప్రశ్నించిన ఈడీ

Delhi Excise Policy Case: దిల్లీ మద్యం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మరో మంత్రిని ఈడీ శనివారం విచారించింది.

Updated : 30 Mar 2024 12:07 IST

దిల్లీ: దేశ రాజధానిలో మద్యం విధానానికి (Delhi Excise Policy Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకోగా.. తాజాగా మరో మంత్రికి సమన్లు జారీ అయ్యాయి.

దిల్లీ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ (Kailash Gahlot)కు ఈడీ శనివారం నోటీసులిచ్చింది. విచారణ నిమిత్తం ఈ రోజే దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కేసుకు సంబంధించిన మంత్రిని ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేసినట్లు తెలుస్తోంది. గహ్లోత్‌ ప్రస్తుతం కేజ్రీవాల్‌ కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మద్యం విధానంపై ముసాయిదాను తయారు చేసే సమయంలో అప్పటి ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇంఛార్జ్‌ విజయ్‌ నాయర్‌.. గహ్లోత్‌ అధికారిక నివాసాన్ని వినియోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కేజ్రీవాల్‌ ఫోన్‌లోని ఎన్నికల వ్యూహాల కోసం ఈడీ యత్నాలు

ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1తో ఆయన కస్టడీ ముగియనుంది. ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా  జడ్జి అనుమతితో సీఎం స్వయంగా తన వాదనలు వినిపించారు. కేవలం నాలుగు వాంగ్మూలాలతోనే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఆప్‌ నేతల ఇళ్లల్లో దర్యాప్తు అధికారులు సోదాలు జరిపారు.

కేజ్రీవాల్‌పై మరో పిటిషన్‌..

కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం అక్కడి నుంచే పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తన సహచర మంత్రులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అయితే, కేజ్రీవాల్‌ను పదవి నుంచి తొలగించాలని తాజాగా దిల్లీ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. ఇదే విషయంపై గతవారం కూడా పిటిషన్‌ దాఖలవ్వగా.. న్యాయస్థానం దాన్ని కొట్టేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని