Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ

Mamata Banerjee: టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటును ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఖండించారు. ఈ యుద్ధాన్ని ఆమె తప్పకుండా గెలుస్తారంటూ ఆమెకు అండగా నిలిచారు.

Published : 08 Dec 2023 17:38 IST

డార్జిలింగ్‌: వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న వ్యవహారంలో టీఎంసీ (TMC) ఎంపీ మహువా మెయిత్రా (Mahua Moitra)ను లోక్‌సభ (Lok Sabha) నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీన్ని ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన ద్రోహంగా పేర్కొన్నారు.

‘‘ఈ ఘటన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. మహువా మెయిత్రా బహిష్కరణను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సమయంలో ఆమెకు పార్టీ అండగా ఉంటుంది. ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేక.. ఇలా కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇది విచారకరమైన రోజు. ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన ద్రోహం’’ అని దీదీ మండిపడ్డారు.

మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు

‘‘లోక్‌సభలో చర్చ సందర్భంగా మహువాకు కనీసం తన వాదన వినిపించే అవకాశం కూడా భాజపా ఇవ్వకపోవడం చాలా అన్యాయం. మెజార్టీలో ఉన్నాం గనుక తాము ఏదైనా చేయొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. కానీ, వారు అధికారం దిగే రోజు వస్తుంది. ఆ విషయం వారు గుర్తుంచుకోవాలి’’ అని కేంద్రాన్ని దుయ్యబట్టారు. ఈ పోరాటంలో మహువా తప్పకుండా విజయం సాధిస్తారని, వచ్చే ఎన్నికల్లో మరింత అత్యధిక మెజార్టీతో మళ్లీ పార్లమెంట్‌లో అడుగుపెడతారని మమతా బెనర్జీ అన్నారు.

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు మహువా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిపిన అనంతరం.. ఈ నివేదికను లోక్‌సభ ఆమోదించింది. ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన నిర్ధారణను సభ అంగీకరించింది. దీంతో ఆమెపై బహిష్కరణ వేటు పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని