Heatwave: ఈ మూడు నెలలు ‘మండే కాలమే’ - ఐఎండీ హెచ్చరిక

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మూడు నెలలపాటు వేడి గాలుల (Extreme Heat) ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) వెల్లడించింది.

Updated : 01 Apr 2024 20:20 IST

దిల్లీ: ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర వేడి (Extreme Heat) వాతావరణం ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) వెల్లడించింది. ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారత్‌లో వడగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. యావత్‌దేశం లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సిద్ధమవుతోన్న వేళ ఐఎండీ ఈ అలెర్ట్‌ జారీ చేసింది.

దేశంలో అనేక ప్రాంతాల్లో ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు. ఈ వేసవిలో దేశవ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులు నమోదవుతాయని, ఈసారి మాత్రం వివిధ ప్రాంతాల్లో కలిపి 10 నుంచి 20 రోజులు వేడిగాలులు వీయొచ్చని తెలిపారు.

జైల్లో ఆ మూడు పుస్తకాలు కావాలి: కోర్టును కోరిన కేజ్రీవాల్‌

ఆంధ్రప్రదేశ్‌ సహా గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్‌, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుందని ఐఎండీ చీఫ్‌ వెల్లడించారు. ఏప్రిల్‌లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చన్నారు. ముఖ్యంగా మధ్య భారతం, ఉత్తర మైదాన ప్రాంతాలు, దక్షిణాది రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో సాధారణంగా ఒకటి నుంచి మూడు రోజులు నమోదు అవుతాయని.. ఈసారి రెండు నుంచి ఎనిమిది రోజులు వీయొచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో వీటి తీవ్రత అత్యంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని