వాయుసేన అధికారుల్ని బలిగొన్నది అతడే.. యాసిన్‌ మాలిక్‌ను గుర్తించిన సాక్షి

వాయుసేన సిబ్బందిపై 1990 నాటి ఉగ్రకాల్పుల కేసులో యాసిన్‌ మాలిక్‌(Yasin Malik) ప్రధాన షూటర్‌ అని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.

Updated : 18 Jan 2024 17:52 IST

దిల్లీ: భారత వైమానిక దళానికి(Air Force) చెందిన నలుగురు అధికారుల ప్రాణాలు బలిగొన్న కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. 1990 నాటి ఈ కేసులో కాల్పులకు పాల్పడింది ప్రధాన షూటర్‌, కశ్మీర్‌ వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌(Yasin Malik)అని  ప్రత్యక్షసాక్షి గుర్తించారు. శ్రీనగర్‌లోని సీబీఐ కోర్టు వర్చువల్ విచారణలో దిల్లీలోని తిహాడ్‌ జైల్లో ఉన్న మాలిక్‌ను వర్చువల్‌గా హాజరుపరచగా, సాక్షి రాజ్వర్‌ ఉమేశ్వర్‌సింగ్ అతడిని గుర్తుపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

1990 జనవరి 25న పాత శ్రీనగర్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో విధుల నిర్వహణకు సిద్ధమైన వాయుసేన సిబ్బంది.. శ్రీనగర్‌ శివార్లలోని రావల్‌పుర ప్రాంతంలో పికప్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే ఉగ్రవాదులు వారిపై కాల్పులకు పాల్పడ్డారు. మాలిక్‌ నాయకత్వంలోనే ఈ ఘాతుకం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో స్క్వాడ్రన్‌ లీడర్‌ రవి ఖన్నా సహా నలుగురు మృతి చెందగా.. 22 మంది గాయపడ్డారు. ఆ సమయంలో మాలిక్‌.. జమ్ముకశ్మీర్‌ లిబరేషన్ ఫ్రంట్‌(JKLF) తరఫున పని చేశాడు. ఆ తర్వాత అరెస్టయిన అతడిపై.. సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కానీ అప్పటినుంచి ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.

మణిపుర్‌లో ఉగ్రకాల్పులు.. ఇద్దరు పోలీసు కమాండోల మృతి

1994లో మాలిక్ జైలు నుంచి విడుదలయ్యాడు. 1995లో విచారణపై కోర్టు స్టే విధించింది. అనంతరం జేకేఎల్‌ఎఫ్ ముక్కలైంది. హింసాత్మక కార్యకలాపాలకు దూరంగా ఉన్న జేకేఎల్‌ఎఫ్ కు చెందిన ఒక వర్గానికి మాలిక్‌ నాయకత్వం వహించాడు.  ప్రస్తుతం తిహాడ్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే ఆరోపణలు రుజువు కావడంతో శిక్ష పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని