MEA: ఖలిస్థానీల లక్ష్యంగా ‘సీక్రెట్‌ మెమో’ వార్తలు.. తీవ్రంగా ఖండించిన భారత్‌

Secret Memo: నిజ్జర్ సహా ఖలిస్థానీ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకోవాలంటూ భారత్‌ ఓ ‘సీక్రెట్ మెమో’ జారీ చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అవన్నీ నకిలీ కథనాలని కొట్టిపారేసింది. అసలేం జరిగిందంటే..

Updated : 11 Dec 2023 10:24 IST

దిల్లీ: ఖలిస్థానీ (Khalistani) ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్యతో భారత్‌, కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికాకు చెందిన ఆన్‌లైన్‌ మీడియా సంస్థ ‘ది ఇంటర్‌సెప్ట్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో న్యూదిల్లీపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. పశ్చిమ దేశాల్లో ఆశ్రయం పొందుతున్న కొన్ని సిక్కు సంస్థలను అణచివేసేలా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపించింది.

‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర అమెరికాలోని తమ ఎంబసీలకు భారత విదేశాంగ శాఖ ఓ ‘సీక్రెట్‌ మెమో (Secret Memo)’ జారీ చేసింది. అందులో భారత నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్న పలువురు ఖలిస్థానీ ఉగ్రవాదుల జాబితా ఉంది. ఆ సిక్కు వేర్పాటువాదులను అణచివేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని అందులో ఆదేశాలిచ్చింది’’ అని ఆ కథనంలో పేర్కొంది. దీంతో ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది.

అబద్ధాల మా నాన్న మళ్లీ తండ్రి కాబోతున్నారు

కాగా.. ఈ కథనాన్ని భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇలాంటి నివేదికలు అవాస్తవమని, అవన్నీ పూర్తిగా కల్పిత కథనాలని మేం గట్టిగా నొక్కి చెబుతున్నాం. ఎలాంటి సీక్రెట్ మెమోను దిల్లీ జారీ చేయలేదు. ఇది భారత్‌కు వ్యతిరేకంగా సాగుతున్న తప్పుడు ప్రచారంలో భాగమే. ఈ కథనాన్ని ప్రచురించిన అవుట్‌లెట్‌.. పాక్‌ ఇంటెలిజెన్స్‌ ప్రోద్బలంతో నకిలీ వార్తలను ప్రచారం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. తమ విశ్వసనీయతను పణంగా పెట్టి మరీ కొందరు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తుంటారు’’ అని విదేశాంగ శాఖ తీవ్రంగా దుయ్యబట్టింది.

ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని భారత్‌ ఇప్పటికే పలుమార్లు కెనడాకు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని