‘చెక్‌ కోర్టుకు వెళ్లండి’: పన్నూ హత్యకు కుట్ర కేసులో నిఖిల్‌ గుప్తాకు సుప్రీం సూచన

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారత వ్యక్తి నిఖిల్‌ గుప్తా (Nikhil Gupta) కోసం అతడి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఇది తమ పరిధిలోకి రాదని, చెక్‌ రిపబ్లిక్‌ కోర్టుకు వెళ్లాలని కోర్టు సూచించింది.

Updated : 15 Dec 2023 14:48 IST

దిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసులో భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా (Nikhil Gupta)పై అభియోగాలు దాఖలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు చెక్‌ రిపబ్లిక్‌లో జైలులో ఉన్నాడు. దీంతో నిఖిల్‌ కోసం అతడి కుటుంబం తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. అతడి అప్పగింత కోసం అమెరికా (USA) ప్రారంభించిన చర్యలపై భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ నిఖిల్‌ కుటుంబం పిటిషన్‌ దాఖలు చేసింది.

‘‘ఈ ఏడాది జూన్‌ నుంచి నిఖిల్‌ గుప్తాను విదేశీ జైలులో అక్రమంగా నిర్బంధించారు. రాజకీయ కుట్రలకు అతడు బాధితుడయ్యాడు. అతడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. నిఖిల్‌ కేసులో మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరిగింది’’ అని అతడి కుటుంబం పిటిషన్‌లో ఆరోపించింది. ఈ కేసులో తమకు సాయం చేసేలా హోం, విదేశాంగ మంత్రిత్వ శాఖలను ఆదేశించాలని నిఖిల్‌ కుటుంబం కోరింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ‘‘ఇది అత్యంత సున్నితమైన అంశం. మరో దేశంలో జరిగిన అరెస్టు మా పరిధిలోకి రావు. అందువల్ల దీనిపై మీరు ఆ దేశ (చెక్‌ రిపబ్లిక్‌) కోర్టుకు వెళ్లండి’’ అని సూచించింది. దీనిపై విచారణను వచ్చే నెలకు షెడ్యూల్‌ చేసింది.

మహిళా జడ్జిపై లైంగిక వేధింపులు.. ‘చనిపోయేందుకు అనుమతినివ్వండి’ అంటూ సీజేఐకి లేఖ

అమెరికా గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కుట్ర కేసులో భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా ప్రమేయం ఉందంటూ గత నెల అమెరికా అటార్నీ కార్యాలయం ఆరోపించింది. ఇందుకోసం అతడికి ఓ భారత ప్రభుత్వ అధికారి నుంచి ఆదేశాలు అందాయని యూఎస్‌ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని ప్రకటించింది.

మరోవైపు, 52 ఏళ్ల నిఖిల్ గుప్తాను ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు ప్రేగ్‌లోని ఓ జైల్లో ఉన్నాడు. అతడిని తమకు అప్పగించాలని ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై భారత వర్గాలు ఇటీవల స్పందిస్తూ.. ఈ హత్య కోసం నిఖిల్‌కు భారత్‌ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని పేర్కొన్నాయి. ఈ కేసులో నిఖిల్‌ గుప్తా దోషిగా తేలితే గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని