Farmers Protest: వారు మన అన్నదాతలు.. చర్చలకు ఎప్పుడూ సిద్ధమే: అనురాగ్‌ ఠాకుర్‌

Farmers Protest: పలు డిమాండ్ల సాధనకై దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన అన్నదాతలతో చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు.

Updated : 22 Feb 2024 09:16 IST

దిల్లీ: రైతుల ఆందోళనలకు (Farmers Protest) చర్చలు ఒక్కటే పరిష్కారమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్‌ అన్నారు. వారు ఈ దేశానికి అన్నదాతలని.. వారితో చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. యూపీఏ పాలనతో పోలిస్తే.. మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే రైతులకు ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించామని చెప్పారు. కేంద్ర కేబినెట్‌ బుధవారం రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైంది. అనంతరం అనురాగ్‌ ఠాకుర్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల ఆందోళనతో దిల్లీ సరిహద్దు ఉద్రిక్తంగా మారిన తరుణంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ.. దేశీయంగా మాత్రం ఆ ప్రభావం రైతులపై లేకుండా చూశామని ఠాకుర్‌ తెలిపారు. ఎరువుల సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు. నానో యూరియా తీసుకొచ్చామన్నారు. యూపీఏ పదేళ్ల పాలనలో గోధుమ, వరి, నూనె గింజల మద్దతు ధర కోసం రూ.5.50 లక్షల కోట్లు వెచ్చించిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం అందుకోసం రూ.18.39 లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు. పప్పు ధాన్యాల కోసం యూపీఏ రూ.1,936 కోట్లు ఇస్తే.. మోదీ సర్కార్‌ దాన్ని రూ.55,000 కోట్లకు పెంచిందని ఉదహరించారు. పంటల బీమా పథకం కింద రైతులకు రూ.1.54 లక్షల కోట్లు అందించినట్లు తెలిపారు. వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.

రైతుల నిరసనల్లో హింస

పంటలకు కనీస మద్దతు ధర (MSP) సహా అన్ని అంశాలపై మరోసారి తమతో చర్చలకు రావాలని రైతులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా ఆహ్వానించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని వారికి విన్నవించారు. పంజాబ్‌, హరియాణా సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతుల డిమాండ్లపై విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని