సొరంగంలోని బిడ్డకోసం 16 రోజులు నిరీక్షించి.. బయటకొచ్చే కొద్ది గంటల ముందే..!

Uttarkashi tunnel: కన్నబిడ్డ టన్నెల్‌లో చిక్కుకుపోయాడని తెలుసుకున్న ఆ తండ్రి తీవ్ర ఆందోళన చెందాడు. బిడ్డ రాకకోసం ఎదురుచూసి.. అతడు రావడానికి కొద్ది గంటల ముందే తుదిశ్వాస విడిచాడు. 

Published : 29 Nov 2023 16:21 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌(Uttarakhand) టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మంది కూలీలు మంగళవారం రాత్రి మృత్యుంజయులుగా తిరిగివచ్చారు. వారి రాకకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన కుటుంబ సభ్యుల ఆరాటం ఫలించింది. 70 ఏళ్ల బాసెత్ ముర్ము కూడా తన 29 ఏళ్ల కుమారుడు భక్తు ముర్ము కోసం ఊపిరిబిగపట్టి వేచిచూశాడు. కానీ బిడ్డ బయటకు రావడానికి కొద్దిగంటల ముందే  తండ్రి తుదిశ్వాస విడిచాడు. దాంతో ఆ కుటుంబం తీవ్ర విషాదానికి గురైంది. జాతీయ మీడియా కథనం వెల్లడించిన వివరాల ప్రకారం.. (Uttarkashi tunnel)

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్‌క్యారా వద్ద సొరంగం తవ్వే పనిలో నిమగ్నమైన కార్మికుల్లో 41 మంది ఈ నెల 12న అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిలో ఝార్ఘండ్‌లోని బాంకిసోల్‌ పంచాయతీకి చెందిన భక్తు ముర్ము కూడా ఉన్నాడు. అతడి క్షేమ సమాచారం కోసం ముర్ము కుటుంబం ఎంతగానో ఎదురుచూసింది. రోజులు గడుస్తుండటంతో కుమారుడి కోసం బాసెన్‌ ఆందోళన చెందేవాడు. ‘టన్నెల్‌లో చిక్కుకున్న వార్త తెలిసిన దగ్గరి నుంచి అతడు కంగారుగానే ఉన్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఉన్నట్టుండి మంచం మీద నుంచి కిందపడిపోయాడు. అదే సమయంలో గుండెపోటు రావడంతో మృతి చెందాడు’ అని బాసెన్‌ అల్లుడు మీడియాకు వెల్లడించాడు.

‘ఇలాంటి కేసుల్లో తీవ్రమైన నిరాశ, ట్రామా.. అధిక రక్తపోటుకు దారితీస్తుంది. దానివల్ల గుండెపోటు సంభవించి ఉండొచ్చు. మంచం మీద నుంచి పడిపోవడంతో తలకైన గాయం కూడా మృతికి కారణమై ఉండొచ్చు’ అని స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే మరణానికి గల స్పష్టమైన కారణాలు తెలుస్తాయని చెప్పారు. ‘రెండురోజుల క్రితం తాను బాసెన్‌ వద్దకు వెళ్లాను. అప్పుడు అతడు ఆరోగ్యంగా కనిపించాడు’ అని మరో అధికారి అన్నారు. మంగళవారం ఉదయం బాసెన్‌ మృతి చెందగా.. అదే రోజు సాయంత్రం భక్తు టన్నెల్‌ నుంచి సురక్షితంగా బయటకురావడం ఆ కుటుంబంలో తీవ్ర ఉద్వేగాన్ని నింపింది.

ముందే చెప్పా.. ఆ 41 మంది బయటకు వస్తారని..!: ఆర్నాల్డ్‌ డిక్స్‌

చిక్కుకుపోయిన చోట సొరంగంలో తిరుగాడడానికి రెండు కి.మీ. మేర ప్రాంతం ఉండడం, బయటి నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటివన్నీ అందుకునే వెసులుబాటును కల్పించడంతో కూలీలు క్షేమంగానే ఉన్నా, పూర్తిగా బయటపడేవరకు వారి కుటుంబాలు, దేశం మొత్తం టెన్షన్‌తో ఎదురుచూసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని