Uttarakhand Tunnel: ముందే చెప్పా.. ఆ 41 మంది బయటకు వస్తారని..!: ఆర్నాల్డ్‌ డిక్స్‌

Uttarakhand Tunnel: ఆస్ట్రేలియా పౌరుడైన ఆర్నాల్డ్ డిక్స్(Arnold Dix).. ఉత్తరాఖండ్ టన్నెల్‌ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

Updated : 29 Nov 2023 15:02 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌ సొరంగంలోనే(Uttarakhand Tunnel) చిక్కుకుపోయిన 41 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అద్భుతమని అంతర్జాతీయ సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్‌ డిక్స్‌(Arnold Dix) హర్షం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘41 మంది సురక్షితంగా బయటపడతారని నేను చెప్పాను గుర్తుందా..? ఈ క్రిస్మస్‌ నాటికల్లా ఎవరికీ ఏమీ కాదన్నాను. ఇప్పుడు క్రిస్మస్ ముందుగానే వచ్చింది. మేం కలిసికట్టుగా పనిచేశాం. భారత్‌లో గొప్ప ఇంజినీర్లు ఉన్నారు. ఈ విజయవంతమైన మిషన్‌లో నేను భాగం కావడం సంతోషాన్నిచ్చింది. ఒక పేరెంట్‌గా ఈ 41 మందిని వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చడం గౌరవంగా భావిస్తున్నాను. మీరు గమనించారో లేదో.. మేము ఒక అద్భుతాన్ని చూశాం. దానిని సాకారం చేసినందుకు నేను గుడికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పాలి’ అని ఆర్నాల్డ్‌ (Arnold Dix) మీడియా ఎదుట సంతోషం వ్యక్తం చేశారు.

Uttarakhand Tunnel: మృత్యుంజయులు

ఆర్నాల్డ్‌ డిక్స్‌(Arnold Dix)..జెనీవా కేంద్రంగా ఉన్న ‘అంతర్జాతీయ సొరంగాలు, భూగర్భ తవ్వకాల సంఘం’ అధిపతిగా ఉన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. జియాలజీ, ఇంజినీరింగ్‌, న్యాయశాస్త్రాలను అభ్యసించారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైన దగ్గరి నుంచి ఆయన ఉత్తర్‌కాశిలోని సిల్‌క్యారా సొరంగం వద్దే ఉన్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. అలాగే టన్నెల్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆలయం వద్ద నిన్న ఆయన స్వయంగా పూజలు చేసిన వీడియో వెలుగులోకివచ్చింది. కూలీల క్షేమం కోసం ఆయన ప్రార్థించడం ప్రతిఒక్కరినీ మెప్పించింది.

ఆర్నాల్డ్‌ ఆస్ట్రేలియా పౌరుడు. దాంతో ఆయనకు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ నుంచి ప్రశంసలు అందాయి. ‘ఈ ఆపరేషన్ భారత అధికారులకు అద్భుతమైన విజయం. దీనిలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉంది’ అని అల్బనీస్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు.

తొలుత భయపడ్డాం.. కానీ, నమ్మకాన్ని వీడలేదు: మోదీతో కార్మికుల సంభాషణ

కాగా, ఈ ఆపరేషన్‌లో భారీ యంత్రాలు మొరాయించాయి.. నిపుణుల వ్యూహాలు కూడా ఒక దశలో ఫలించలేదు. చివరికి రంగంలోకి దిగిన నిపుణులు తమ చేతులతో, చిన్నపాటి పనిముట్లతో మిగిలిన పనిని పూర్తిచేశారు. దాంతో మంగళవారం రాత్రి కూలీలంతా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. తాము ప్రాణాలతో సురక్షితంగా బయటకు రావడంతో కార్మికులంతా ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని