Modi: బాధ్యతలు స్వీకరించిన మోదీ.. తొలి సంతకం దేనిపైఅంటే..?

నేడు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్రమోదీ (PM Modi).. తొలిసంతకం చేశారు. 

Updated : 10 Jun 2024 12:33 IST

దిల్లీ: భారత ప్రధానిగా నరేంద్రమోదీ(PM Modi) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని సౌత్‌బ్లాక్‌లోని పీఎంఓ కార్యాలయంలో మూడో దఫా తన విధుల్ని మొదలుపెట్టేశారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం చేశారు. దీంతో 9.3 కోట్లమంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం అందుతుంది.

‘‘మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం వారి సంక్షేమానికి సంబంధించినదే కావడం విశేషం. రాబోయే రోజుల్లో వ్యవసాయరంగానికి, కర్షకుల సంక్షేమంపై మా ప్రభుత్వం మరింత దృష్టి సారించనుంది’’ అని సంతకం చేసిన తర్వాత మోదీ వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. ఈరోజు మోదీ క్యాబినెట్ తొలి సమావేశం జరగనుంది. పార్లమెంట్‌ సమావేశాలను ఏర్పాటుచేయాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్మును అభ్యర్థించనుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ జరగబోయే సమావేశాల ప్రారంభం రోజున రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ ప్రభుత్వ దార్శనికత, ప్రాధాన్యతలను పేర్కొంటారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. తాజా ఎన్నికల్లో కూటమి విజయదుందుభితో వరసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత దేశంలో వరసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను సొంతం చేసుకున్నారు. తాజా కేంద్ర సర్కార్ 71 మంది మంత్రులతో కొలువుదీరింది. అందులో 30 మంది క్యాబినెట్‌ మంత్రులుగా ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని