Arvind Kejriwal: పదవిలో ఉండగా అరెస్టయిన తొలి సీఎం!

Arvind Kejriwal Arrest: పదవిలో ఉండగా అరెస్టైన తొలి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ కావడం గమనార్హం. 

Published : 22 Mar 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయ్యారు. గురువారం సాయంత్రం సీఎం నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కావడం గమనార్హం. ఈ క్రమంలో సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత అరెస్టైన వారి జాబితాను పరిశీలిస్తే.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జయలలిత మొదలు ఓం ప్రకాశ్‌ చౌతాలా (హరియాణా), మధు కోడా (ఝార్ఖండ్‌), హేమంత్‌ సోరెన్‌ (ఝార్ఖండ్‌) వంటి నేతలు ఉన్నారు. 

లాలూ ప్రసాద్‌ యాదవ్‌: 1990-1997 మధ్యకాలంలో బిహార్‌ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పనిచేశారు. దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూతోపాటు మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రాలను 2013లో న్యాయస్థానం దోషిగా తేల్చింది. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. బెయిల్‌పై బయటకు వచ్చారు.

జయలలిత: 1991-2016 మధ్యకాలంలో పలుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కలర్‌ టీవీల కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలకు సంబంధించిన కేసులో డిసెంబరు 7, 1996లో అరెస్టయ్యారు. అప్పుడు నెల రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో న్యాయస్థానం ఆమెను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించడంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఓంప్రకాశ్‌ చౌతాలా: 1989-2005 మధ్య హరియాణా ముఖ్యమంత్రిగా పలుసార్లు పనిచేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో 2013లో ఆయన దోషిగా తేలడంతో పదేళ్ల శిక్ష పడింది. అనంతరం అక్రమాస్తుల కేసులో 2022లో కోర్టు ఆయనకు మరో నాలుగేళ్లు శిక్ష విధించింది.

మధు కోడా: 2006-2008 మధ్య ఝార్ఖండ్ సీఎంగా పనిచేసిన మధు కోడా.. మైనింగ్‌ కేసులో 2009లో అరెస్టయ్యారు.

హేమంత్‌ సోరెన్‌: 2013-2024 మధ్య కాలంలో ఝార్ఖండ్‌ సీఎంగా పనిచేసిన హేమంత్‌ సోరెన్‌.. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన ఈఏడాది జనవరి 31న అరెస్టయ్యారు. అంతకుముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో జేఎంఎం సీనియర్‌ నేత, చంపయీ సోరెన్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు