Delhi: పొగమంచు ప్రభావం.. విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం

దేశ వ్యాప్తంగా పలు నగరాలను పొగమంచు కమ్మేసింది. ఉత్తర భారత దేశంలోని పలు విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది.

Updated : 25 Dec 2023 15:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ రాజధాని దిల్లీ సహా పలు రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. దిల్లీలో ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఈ కారణంగా రహదారులపై ప్రయాణాలు అత్యంత కష్టంగా మారాయి. మరోవైపు పాలం విమానాశ్రయంలో ఎదురుగా కొద్ది మీటర్ల దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించనంత దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇక్కడ రన్‌వేపై విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో అత్యవసరంగా టేకాఫ్‌ కావాల్సిన విమానాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. పలు జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ విమానాశ్రయానికి వస్తున్న పలు  విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు ఫ్లైట్‌ స్టేటస్‌ను తరచూ చెక్‌ చేసుకోవాలని స్పైస్‌ జెట్‌ కోరింది. పొగమంచు వల్ల తమ సేవలపై ప్రభావం పడుతోందని వెల్లడించింది.

జేఎన్‌.1తో భయం లేదు

దిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని వివిధ ఎయిర్‌ పోర్టుల్లో కూడా విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అమృత్‌సర్‌, ప్రయాగ్‌రాజ్‌, జైసల్మేర్‌, ఆగ్రా, గ్వాలియర్‌ విమానాశ్రయాల్లో ఈ పరిస్థితి నెలకొంది. సఫ్దార్‌గంజ్‌లో 200 మీటర్లు, షిల్లాంగ్‌ విమానాశ్రయంలో 300 మీటర్ల విజిబిలిటీ ఉంది. ఇక హైదరాబాద్‌ విమానాశ్రయానికి వస్తున్న కొన్ని విమానాలను కూడా తక్కువ విజిబిలిటీ కారణంగా దారి మళ్లించారు. దట్టమైన పొగమంచు కారణంగా సోమవారం ఉదయం 6 గంటలకు దిగాల్సిన బెంగళూరు, ముంబయి విమాన సర్వీసుల ల్యాండింగ్‌కు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. మరో మూడు విమాన సర్వీసులను గన్నవరం మళ్లించారు.

దిల్లీలో చలితీవ్రత పెరగడంతో నిరాశ్రయులు షెల్టర్లలో తలదాచుకోవాలని అధికారులు సూచించారు. ఆర్కేపురం, మునిర్కా, లోధి రోడ్‌, రింగ్‌ రోడ్‌, ఎయిమ్స్‌ వద్ద దట్టమైన పొగమంచు కురిసింది. ఇక రాజధానిలో గాలి నాణ్యత అత్యంత దారుణంగా ఉంది. సెంట్రల్‌ పొల్యూషన్‌ బోర్డ్‌ ఏక్యూఐ సూచీ 400 పాయింట్లుగా నమోదైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని