UP: కుమారుడి మృతదేహంతో ఆసుపత్రిలో నిరసనకు దిగిన మాజీ ఎంపీ

తన కుమారుడి మృతికి కారణమైన డాక్టర్‌ను విధుల్లోంచి తొలగించాలని లఖ్‌నవూలోని ఎస్‌జీపీజీఐ ఆసుపత్రిలో భాజపాకు చెందిన మాజీ ఎంపీ నేలపై కూర్చొని ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు ఎదుట నిరసనకు దిగారు. 

Published : 31 Oct 2023 01:35 IST

దిల్లీ: ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో బెడ్‌లు ఖాళీ లేక భాజపాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు తన కుమారుడిని కోల్పోయారు. దీంతో ఆయన తన కుమారుడి మృతదేహంతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ఎదుట నేలపై కూర్చొని నిరసనకు దిగిన ఘటన చర్చనీయాంశమైంది. తన కుమారుడు మృతి చెందడానికి కారణమైన డాక్టర్‌ను విధుల్లోంచి తొలగించాలని ఆయన పట్టుబట్టారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో చోటుచేసుకుంది. మాజీ ఎంపీ భైరాన్‌ ప్రసాద్‌ మిశ్రా తన కుమారుడు ప్రకాశ్‌ మిశ్రా(41)కు కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తడంతో లఖ్‌నవూలోని ఎస్‌జీపీజీఐ ఆసుపత్రికి ఆదివారం రాత్రి 11 గంటలకు తీసుకొచ్చారు. అయితే కొన్ని గంటలకే ప్రకాశ్‌ మిశ్రా మృతి చెందాడు.

దీంతో సదరు మాజీ ఎంపీ తన కుమారుడి మృతదేహంతో ఆసుపత్రి వార్డులో నేలపై కూర్చొని నిరసనకు దిగారు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్‌లు ఖాళీగా లేవని, ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యుడు ఎలాంటి సహాయం చేయలేదని ఆయన ఆరోపణలు చేశారు. ‘‘నేను నా కుమారుడిని కోల్పోయాను. నా కుమారుడి మృతి తర్వాత దాదాపు 20-25 మందికి చికిత్స చేశారు. నేను నిరసనకు దిగడంతో సదరు డాక్టర్‌ను తొలగించాలని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. నా కుమారుడు మృతి చెందడానికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలి’’ అని మాజీ ఎంపీ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఆసుపత్రి చీఫ్‌ ఆర్‌కే ధీమన్‌ వివరణ ఇచ్చారు. ‘‘ఎంపీ కుమారుడిని ఇంటెన్సివ్‌ కేర్‌ యునిట్‌(ఐసీయూ)లో చేర్చమని విధుల్లో ఉన్న డాక్టర్‌ చెప్పారు. అయితే అక్కడ బెడ్‌లు ఖాళీగా లేవు. అయినా సదరు వైద్యుడు అలా ఎందుకు చెప్పాడో తెలియదు. మేము ఒక కమిటీని ఏర్పాటు చేశాము. దాని ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం డాక్టర్‌ను విధుల్లోంచి తొలగించాం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటన నేపథ్యంలో అధికార భాజపా ప్రభుత్వంపై సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది ఆసుపత్రి తప్పిదం కాదని, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తప్పిదమని అన్నారు. ఆసుపత్రులకు ప్రభుత్వం ఎందుకు నిధులు సమకూర్చడం లేదని ప్రశ్నించారు. మరోవైపు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య స్పందించారు. ప్రభుత్వం ఈ ఘటన పట్ల కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇదొక దురదృష్టకర సంఘటన అని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని