Uddhav Thackeray: ప్రభుత్వ కార్యక్రమంలో దారుణం.. బాధ్యులెవరు?: ఉద్ధవ్‌ విమర్శ

మహారాష్ట్ర భూషణ్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన వారిలో 11 మంది వడదెబ్బ ప్రాణాలు కోల్పోయారు. 49 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే బాధితులను కలిశారు. 

Published : 17 Apr 2023 16:25 IST

ముంబయి: మహారాష్ట్ర నవీ ముంబయిలోని ఖర్గర్‌లో నిర్వహించిన మహారాష్ట్ర భూషణ్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో దుర్ఘటన చోటు చేసుకుంది. కార్యక్రమానికి హాజరైన వారిలో 11 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు.. మిగిలిన 49 మందిని ఎమ్‌జీఎమ్‌ కౌముతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం బాధితులను కలిసి పరామర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంలో జరిగిన ఈ దారుణానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అప్పాసాహెబ్ ధర్మాధికారి మహారాష్ట్ర భూషణ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో 11 మంది మరణించటం బాధాకరం. చికిత్స పొందుతున్న ఐదారుగురితో నేను మాట్లాడాను. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రదానోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను సరిగా చేయకపోవటం వల్లే ఈ దుస్థితి సంభవించింది. ఈ ఘటనపై ఎవరు విచారణ జరుపుతారు.. ఈ దారుణానికి ఎవరు బాధ్యత వహిస్తారని?’’ అంటూ ఠాక్రే ప్రశ్నించారు. ఠాక్రేతో పాటు ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌లు కూడా హాజరయ్యారు.

కార్యక్రమంలో మరణించిన వారి సంఖ్యను రాష్ర్ట ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనపై సీఎం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అవార్టు ప్రదానోత్సవంలో 50 మంది వడదెబ్బ బారిన పడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 11 మంది మరణించటం విచారకరం.  ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ డాక్టర్లతో బాధితుల విషయంపై మాట్లాడాను. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నాను. కొంతమందిని టాటా ఆసుపత్రికి తరలించారు. మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మరణించినవారి కుటుంబాలకు రూ. 5 లక్షలు.. చికిత్స పొందుతున్న వారికి ఉచిత వైద్యం అందజేస్తుంది’’ అని ట్వీట్‌ చేశారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని